పరిగి, నవంబర్ 6 : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హైకోర్టు జడ్జి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా కమిటీ వికారాబాద్ ఆధ్వర్యంలో జరిగిన హెల్త్ అవేర్నెస్ క్యాంపును జస్టిస్ నవీన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు.
ఈ సందర్భంగా అంబులెన్స్‌ను జస్టిస్ నవీన్‌రావు ప్రారంభించి, మొక్కలు నాటారు. సమావేశంలో జస్టిస్ మాట్లాడుతూ.. పిల్లలు సంవత్సరానికి ఒకసారి.. పెద్దలు కనీసం ఆరు నెలలకు ఒకసారి పూర్తిస్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్ జగన్మోహన్ ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం శుభ సూచకమని.. ప్రత్యేకంగా అంబులెన్స్ అందించడం అభినందనీయమన్నారు.
సమాజంలో సేవ చేయడానికి ముందుకు వచ్చేవారి సేవలను సద్వినియోగం చేసుకుంటూ వారిని ప్రోత్సహించడంతోపాటు వారికి సహకరించాలని సూచించారు. హైకోర్టులో ఓ న్యాయవాది ఆరోగ్య పరిస్థితి విషమిస్తే అంబులెన్స్ లేక సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోయినట్లు గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లోనూ వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేయడం ద్వారా పేదలకు మరింత మేలు చేకూరుతుందని జడ్జి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. జబ్బు వస్తే కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి ఖర్చులు భరించడం కష్టతరమవుతుందని.. ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సి వస్తుందన్నారు.
వ్యాధులు రాకముందే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని జాగ్రత్త వహించాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావునాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత ఆహారపు అలవాట్లు మారాయని.. జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ.. డాక్టర్, న్యాయవాది దగ్గర ఏ విషయమైనా దాచకుండా చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శృతి ధూత, విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్, పరిగి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్‌యాదవ్ పాల్గొన్నారు.