పరిగి, నవంబర్ 5 : గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ప్రజల మన్ననలు పొందుతున్నది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడొద్దనే సదుద్దేశంతో రాష్ట్ర సర్కార్ ఈ పథకం కింద 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అవసరమైనవారు 102కు కాల్ చేస్తే వీలైనంత తొందరలో అక్కడికి చేరుకొని దవాఖానలకు చేరవేస్తున్నాయి. అంతేకాకుండా వైద్య పరీక్షలు, లేదా ప్రసవం అనంతరం మళ్లీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తున్నాయి. మారుమూల గ్రామాలకు సైతం సేవలందిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఏడు 102 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 85,327 మంది మహిళలు వీటి సేవలను సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 46,468 ట్రిప్పులు తిరిగాయి. అమ్మఒడి సేవలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాలతో గర్భిణులు, బాలింతలకు వ్యయప్రయాసలు తప్పడంతోపాటు సురక్షితమైన ప్రయాణం లభిస్తున్నదని పేర్కొంటున్నారు. -పరిగి, నవంబర్ 5
గర్భిణులు, బాలింతలకు సేవలందించేందుకు తీసుకువచ్చిన అమ్మ ఒడి వాహనాలు అత్యున్నత సేవలతో గ్రామీణ ప్రాంత మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 2018 జనవరి 26న 102 వాహనాలను(అమ్మ ఒడి) ప్రారంభించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో వికారాబాద్, మోమిన్‌పేట్, తాండూరు, బషీరాబాద్, కొడంగల్, పరిగి, కులకచర్లలో అమ్మ ఒడి వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 154 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా.. వాటికి కేటాయించిన రోజుల్లో సంబంధిత ఉప కేంద్రాల పరిధిలో 102(అమ్మ ఒడి) సేవలు అందుబాటులో ఉంటాయి. గర్భిణులు, బాలింతలకు రవాణా సదుపాయం కల్పిస్తూ వారిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లస్టర్ హెల్త్ సెంటర్లకు తీసుకువెళ్లి పరీక్షల అనంతరం తిరిగి ఇంటి వద్ద వదిలిపెడుతున్నాయి. ఈ సేవలు ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా అందుతుండడంతో అందరి అభినందనలందుకుంటున్నది.
85,327 మందికి అందిన సేవలు
అమ్మ ఒడి వాహనాలు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 85,327 మందికి సేవలు అందించాయి. 2018లో 7 వాహనాలు 6699 ట్రిప్పుల్లో 11,522., 2019లో 9404 ట్రిప్పుల్లో 18,752., 2020లో 9982 ట్రిప్పుల్లో 12,961., 2021లో 10,495 ట్రిప్పుల్లో 21,830., 2022లో ఇప్పటివరకు 9888 ట్రిప్పుల్లో 20,262 మందికి సేవలు అందించాయి.
గర్భిణులు, బాలింతలకు అమ్మ ఒడి సేవలు
జిల్లాలో 7 అమ్మ ఒడి వాహనాలు, 154 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలకు నెలలో కనీసం మూడు పర్యాయాలు ఎప్పుడెప్పుడు వచ్చేది ముందస్తుగానే సమాచారముంటుంది. దీంతో ఆయా రోజుల్లో సంబంధిత గ్రామాల గర్భిణులు, బాలింతలు అమ్మ ఒడి సేవలు అందుకుంటున్నారు. ప్రధానంగా గర్భిణులు 3వ నెల నుంచి 9వ నెల వరకు ప్రతి నెల ఏఎన్సీ చెకప్‌ల కోసం అమ్మ ఒడి వాహనాల్లోనే వారిని ఆశా వర్కర్లు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్లస్టర్ హెల్త్ సెంటర్లకు తీసుకెళ్తున్నారు.
చెకప్‌ల అనంతరం వారిని తిరిగి తమ స్వగ్రామాల్లో వదలిపెడుతున్నారు. అలాగే సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరిగిన తర్వాత బాలింతలను ఈ వాహనాల్లోనే తమ ఇంటివద్దకు పంపిస్తున్నారు. సిజేరియన్ ప్రసవాలు జరిగితే ఇతర వైద్య సేవల కోసం సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అమ్మ ఒడి వాహనాలను ఉపయోగిస్తున్నారు. శిశువులకు వ్యాక్సినేషన్ కోసమూ తల్లీబిడ్డలను ఈ వాహనాల్లోనే సర్కారు దవాఖానలకు తీసుకెళ్తున్నారు. అమ్మ ఒడి వాహనాల సేవలు, కేసీఆర్ కిట్, నగదు అందజేయడంతో గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.