యాచారం, నవంబర్ 5 : ఆ పల్లె ప్రభుత్వ ఉద్యోగుల ముల్లె.. ఏకంగా 250 మందికి పైగా సర్కార్ ఉద్యోగాల్లో ఉండి కొలువుల కల్పవల్లిగా పేరొందుతున్నది యాచారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం. ఇక్కడి రైతులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన ఇక్కడి యువత ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా చదివి రాణిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఈ గ్రామస్తులు ఉద్యోగులుగా ఉన్నారు. గ్రామంలో 576 కుటుంబాలుండగా, 250మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. అత్యధికంగా రక్షణశాఖలోనే పనిచేయడం గమనార్హం. అంతేకాకుండా చాలామంది ప్రైవేటు సంస్థల్లోనూ ఉన్నత హోదాల్లో రాణిస్తున్నారు. గ్రామం నుంచి ఎంతోమంది గ్రూప్2, గ్రూప్4 అధికారులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్మీ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, ఉపాధి, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణను ఇక్కడి యువతీయువకులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
అది ఒక మారుమూల పల్లె. ఆ పల్లెవాసుల జీవనాధారం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది. రైతులు వ్యవసాయం చేస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు. అటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇటు కష్టపడి చదివే తత్వం, అనుకున్నది సాధించడం, పోటీతత్వాన్ని జయించడం ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత. కృషితో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఆ గ్రామ యువత ముందంజలో ఉంటారు. గ్రామంలో ఉదయం తెల్లవారిందంటే చాలు అటు రైతు లు వ్యవసాయానికి, ఇటు ఉద్యోగస్థులు కార్యాలయాలకు, విద్యార్థులు చదువుకు వెళ్తుంటారు. గ్రామస్తులు ఏదో ఒక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేయడం గ్రామం ప్రత్యేకతగా చెప్పవచ్చు. గ్రామంలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇక్కడి గ్రామస్తులు ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
మండలంలోని అన్ని గ్రామాలకు అక్కడి యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. అదే మండలంలోని చౌదర్పల్లి అనే చిన్న గ్రామం.. 2011జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2,452మంది జనాభా ఉండగా, ఇందులో పురుషులు 1,288, స్త్రీలు 1,164 మంది ఉన్నారు. గ్రామంలో 576 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో మొత్తం ఇప్పటికే 250 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది ఉద్యోగ వేట లో ఉన్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో పక్క ఊరైన యాచారం గ్రామానికి కాలినడకన వెళ్లి ఉన్నత పాఠశాలలో చదువుకునేవారు. గ్రూప్-2 ఉద్యోగులు, గ్రూప్-4 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్మీ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, ఉపాధి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతర రంగాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అంతేకాకుండా ఇంకొంత మంది విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉపాధి పొందుతూ సొంతకాళ్లపై నిలబడి ఆదర్శంగా నిలుస్తున్నారు.
250 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు
గ్రామంలో 250కి పైగా మంది వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇందులో 160మందికి పైగా పోలీసులు ఉండగా, ఇందులో సివిల్ ఎస్ఐ-1, కానిస్టేబుల్-128మంది, హోంగార్డులు-32, ప్రస్తుతం మరో 35మంది యువకులు ప్రిలిమ్స్ పరీక్ష అర్హత సాధించారు. త్వరలో జరిగే ఈవెంట్స్‌కు సిద్ధమవుతున్నారు. పంచాయతీరాజ్ ఏఈ-1, ఆర్టీసీ ఉద్యోగులు-18, ప్రభుత్వ ఉపాధ్యాయులు-40, పంచాయతీ కార్యదర్శులు-3, జూనియర్ అసిస్టెంట్-1, ఈజీఎస్-1, పీఏసీఎస్ సీఈవో-1, సీఐడీ-2, డీజీపీ-3, పీఏసీఎస్-3, విద్యుత్ శాఖలో-3, ఆర్మీ-1, రెవెన్యూ-3, మున్సిపల్-2, విశ్రాంత తహసీల్దార్లు-2, విశ్రాంత జాయింట్ డైరెక్టర్-1, ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్న కుటుంబాలు-8, ఒకే ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు ఉన్న కుటుంబం-5, విదేశాల్లో 10మందికి పైగా స్థిరపడ్డారు. మండలంలోని గున్గల్ క్రీడలో సుమారు 40మందికిపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. గతంతో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ ఆర్మీ ప్రాణాలర్పించాడు. ఇంకా 50మందికి పైగా డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇతర రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను స్వరాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగాలు చేస్తూ మండలంలోని 24గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా సత్తా..
ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించలేక ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతకు ఉచితంగా తగిన శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో కానిస్టేబుల్ ఉద్యోగాలను అధికంగా సాధించి గ్రామానికి చెందిన యువత సత్తా చాటారు. ఏకంగా 30కి పైగా ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు ఇక్కడి యువత. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా కానిస్టేబుల్ శిక్షణ పొందిన వారిలో సుమారు 20మందికి పైగా పోలీస్ ఉద్యోగాలు సాధించారు.
గ్రామంలో 90శాతం ప్రజలు విద్యావంతులు కావడం విశేషం.
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ శిబిరాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. యువత విద్యార్థి దశనుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ముందుగానే లక్ష్యాన్ని ఎంచుకొని ఉద్యోగ సాధన కోసం అడుగులు వేయాలి.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే
పట్టుదలతో ఉద్యోగం సాధించా
జీవితంలో స్థిరపడాలని, పేదరికాన్ని జయించాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే తపన, పట్టుదలతో ఉద్యోగం సాధించా. యాచారం పీఏసీఎస్ కార్యాలయంలో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నా. ప్రజలకు, రైతులకు సేవలందించడం గర్వంగా ఫీలవుతున్నా.
– నాగరాజు, పీఏసీఎస్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి