బొంరాస్పేట, నవంబర్ 5 : కూలీనాలీ చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టి పొదుపు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వం సరికొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న సురక్ష పథకానికి కొన్ని మార్పులు చేసి మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు స్త్రీనిధిలో రుణం తీసుకుంటే సురక్షా బీమా పథకం వర్తించేది. ఈ పథకంలో చేరిన సభ్యురాలు, ఆమె భర్త ఎవరైనా ఏ కారణంగానైనా చనిపోతే సురక్షా బీమా పథకం కింద కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించేవారు. దీనిలో తక్షణ సాయంగా అంత్యక్రియలకు రూ.5వేలు, మిగిలిన రూ.95వేలు చెక్కు రూపంలో అందించేవారు. ఇదే పథకాన్ని సురక్ష-బి పథకంతో తీసుకువచ్చి రుణాలతో సంబంధం లేకుండా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా కూడా చేరేలా వెసులుబాటు కల్పించారు.
నేటి రోజుల్లో పురుషులతోపాటు సమానంగా కుటుంబ బాధ్యతలు మోస్తున్న మహిళలకు ఈ పథకం ఎంతో ధీమాగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా పథకాలను అమలు చేసినా అవి అంత పకడ్బందీగా అమలు కాలేదు. కానీ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి కోసం సురక్ష-బి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ బీమా పథకం గురించి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎక్కువగా తెలియదు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ఈ పథకంపై ఎక్కువగా ప్రచారం చేసి మహిళలను చేర్పిస్తే ప్రయోజనంగా ఉంటుంది.
జిల్లాలో 19,361 సంఘాలు
వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 19,361 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,92,292 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా సురక్ష-బి బీమా పథకంలో చేరడానికి అర్హులు.
సురక్ష-బి పథకంలో చేరాలంటే..
సురక్ష-బి పథకంలో చేరాలంటే మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలై ఉండాలి. ఏడాదికి కొంత మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులందూ కచ్చితంగా చేరాలనే నిబంధన లేదు. ఇందులో ఆసక్తి ఉన్నవారు పథకంలో చేరేలా వెసులుబాటు కల్పించారు. సభ్యురాలు ఏడాదికి రూ.230 ప్రీమియం చెల్లించాలి. భర్తకు రూ.317 ప్రీమియం చెల్లించాలి. ఇలా ఇద్దరు కలిపి రూ.547 ప్రీమియం చెల్లిస్తే ఏడాదిపాటు బీమా వర్తిస్తుంది. రూ.1641 చెల్లిస్తే మూడేండ్లపాటు బీమా పథకం వర్తిస్తుంది. ఈ నగదును చెల్లించలేని సభ్యులు స్త్రీనిధి నుంచి రుణం పొందే అవకాశం కూడా కల్పించారు. తీసుకున్న రుణాన్ని వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
కుటుంబానికి బీమా రక్షణగా ఉంటుంది
– కృష్ణన్, డీఆర్డీవో
పొదుపు సంఘాలలోని మహిళలు సురక్ష-బి బీమా పథకంలో చేరితే వారి కుటుంబాలకు రక్షణగా ఉంటుంది. సమాజంలో మగవారితో సమానంగా మహిళలు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరి సద్వినియోగం చేసుకోవాలి. సిబ్బంది ద్వారా మహిళలకు బీమా పథకం గురించి తెలియజేస్తున్నాం.