కడ్తాల్, నవంబర్ 5 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. కల్వకుర్తిలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, అవసరమైన చోట వంతెనలు నిర్మిచండంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న పంచాయతీరాజ్ రోడ్లు, బీటీ రోడ్ల మరమ్మతు పనులకు సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ గ్రాంట్సు ద్వారా రూ.25 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా… ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మొదట ప్రాధాన్యతలో భాగంగా కడ్తాల్ మండల పరిధిలోని ముద్విన్-ఆకుతోటపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు, మాడ్గుల మండలం అవురుపల్లి-నల్లవారిపల్లి బీటీ రోడ్డుకు రూ.2 కోట్లు, తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి- వీరన్నపల్లి బీటీ రోడ్డుకు రూ.1.95 కోట్లు, ఆమనగల్లు మండలం కోనాపూర్-రాంనుంతల మధ్య వంతెన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ముద్విన్-ఆకుతోటపల్లి, కోనాపూర్-రాంనుంతల గ్రామాల మధ్య వంతెనల నిర్మాణాలతో నాలుగు గ్రామాలతో పాటు శెట్టిపల్లి, గౌరారం, చరికొండ, పల్లెచెల్కతండా, మర్రిపల్లి, ఏక్వాయిపల్లి గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. త్వరలో ముద్విన్, కోనాపూర్ గ్రామాల్లోని వంతెన నిర్మాణాలకు భూమి పూజ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాడ్గుల, నవంబర్ 5 : పేదలకు సీయం సహాయనిధి ఆరోగ్య భద్రతలను కల్పిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని చంద్రయన్‌పల్లి గ్రామానికి చెందిన మహేశ్‌కు రూ.48 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కను లబ్ధిదారుడికి శనివారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, చంద్రయన్‌పల్లి సర్పంచ్ యాదిరెడ్డి, కలకొండ రైతు కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, నల్లచెరువు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.