షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్ 4 : ఆడబిడ్డలకు కొండంత అండగా నిలిచే విధంగా తెలంగాణ సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదింట్లో కల్యాణకాంతులను నింపుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో వినయ్‌కుమార్, కమిషనర్ చీమ వెంకన్నతో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డల పెండ్లీలు చేయడానికి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మౌనిక, మాజీ చైర్మన్ విశ్వం, ఎంపీటీసీ భీష్వ రామకృష్ణ, సర్పంచులు శ్రీశైలం, మాధవీ, నర్సింహులు, మోబిన్గోరి, కౌన్సిలర్ అంతయ్య, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు జూపల్లి శంకర్, నర్సింహులు, ఎజాజ్, మచ్చేందర్, యాదయ్య, జమృత్‌ఖాన్, శేఖర్, రాఘవేందర్, భిక్షపతి, సునీల్‌రెడ్డి, బాలు, బాలాజీఉదయ్ పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం దళిత బంధు
దళిత బంధు పథకం దళితులకు వరంలా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ సుంకం జంగయ్యకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను అందజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ దళిత సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నదన్నారు.
మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 2,4,7వ వార్డుల్లో నూతన అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు చెట్ల పావనినర్సింహులు, శ్రీనివాస్, రాజేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. మున్సిపాలిటీలోని వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీరోడ్లు, వీధి దీపాలు, అంతర్గత మురుగుకాలువలతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందన్నారు.
దళిత బంధుతో దళితుల ఆర్థికాభివృద్ధి
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళితులను ప్రగతి దిశగా పయనింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం చౌదరిగూడ మండలం గుంజల్‌పహడ్ గ్రామానికి చెందిన వెంకటయ్యకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా దళిత సంక్షేమం కోసం ఇన్ని నిధులను కేటాయించలేదని. ఉపాధిని చూపే విధంగా ప్రభుత్వం దళిత బంధును ప్రవేశపెట్టడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి దళిత కుటుంబం దళిత బంధు పథకంతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని, విడుతల వారీగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.