రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అన్నదాతల కుటుంబాలు బాగుండాలన్న సదుద్దేశంలో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రైతుబీమాతో రైతులకు కొండంత అండగా నిలుస్తున్నది. రైతు బందును అమలు చేస్తూ పెట్టుబడి కోసం రెండు పంటలకు ఏటా ఎకరానికి రూ.10 వేలను అందజేస్తున్నది. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షలను అందజేస్తూ బతుకుపై భరోసానిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 3,928 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు రైతుబీమా కింద రూ.196.40 కోట్లను అందజేసింది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న గొప్ప ఆలోచనతో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాలో రైతు బీమా కింద 1,89,396 మంది రైతులు ఉన్నారు. రైతు బీమాకు 59 ఏండ్ల వరకు అర్హులు. ఈ ఏడాది కొత్తగా 10,390 మంది రైతులకుగాను ఒక్కో రైతుకు రూ.3,475 ప్రభుత్వం బీమా ప్రిమీయాన్ని చెల్లించింది.
రైతు కుటుంబాలకు అండగా..
రైతు కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ, పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతు ఏ కారణం చేత మృతి చెందినా రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ అన్నదాతల్లో మనోధైర్యాన్ని నింపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 83 రైతు వేదికలను నిర్మించడంతో పాటు కళ్లాలను ఏర్పాటు చేసింది. వరి కోత మిషన్లు, ట్రాక్టర్లను కేటగిరీల వారీగా సబ్సిడీపై అందజేసిన ప్రభుత్వం అన్నదాతల మోములో ఆనందాన్ని నింపింది. సాగు మొదలు, పంట చేతికొచ్చాన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ అన్నదాతలకు ఆత్మీయబంధువుగా నిలుస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలు, 558 గ్రామపంచాయతీల్లోని రైతులకు బీమా పాలసీ చేయించి వారి కుటుంబాగలకు అండగా నిలిచారు. రైతుబీమా కింద 2018లో 835 మంది రైతులు మృతి చెందగా రూ.41.25 కోట్లు, 2019లో 826 మంది మృతి చెందగా రూ.41.30 కోట్లు, 2020లో 1207 మంది మృతి చెందగా రూ.60.35 కోట్లు, 2021లో 922 మంది మృతి చెందగా రూ.46.10 కోట్లు, 2022లో (03-11-2022 వరకు) 138 మంది మృతి చెందగా రూ.69.0 కోట్లను బాధిత కుటుంబాలకు బీమా సొమ్మును అందజేసింది.
పెరిగిన రైతు బీమా పాలసీదారులు..
ప్రతి సంవత్సరం రైతు బీమా పాలసీదారులు పెరుగుతున్నారు. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో 10,390 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రిమీయాన్ని చెల్లించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 138 మంది మృతి రైతులు మృతి చెందగా రూ.69.0 కోట్లను రైతు కుటుంబాలకు చెల్లించింది. ప్రతి సంవత్సరం కొత్తగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, రంగారెడ్డి జిల్లా