కొడంగల్, అక్టోబర్ 31 : జల్సాలు ఎంతకైనా తెగిస్తాయని, వాటి కోసం ఎటువంటి దారుణానికైనా ఒడికట్టేందుకు పూనుకుంటారనేది కొడంగల్‌లో జరిగిన బాలుడి కిడ్నాప్‌తోపాటు దారుణ హత్య ఉదంతం గుర్తు చేస్తున్నది. జల్సాలకు అలవాటుపడ్డ వ్యక్తి.. వాటిని తీర్చుకునేందుకు డబ్బును సంపాదించే క్రమంలో వారం రోజులుగా పథకం ప్రకారం బాలుడిని కిడ్నాప్ చేసి, బాలుడు సహకరించకపోవడంతో దారుణహత్యకు ఒడిగట్టిన సంఘటన పట్టణంలో శనివారం జరిగింది. ఎస్పీ కోటిరెడ్డి కథనం ప్రకారం.. జల్సాలకు అలవాటుపడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో ఉన్నాడు పట్టణానికి చెందిన అజయ్. ఆర్థికంగా ఎవరున్నారు అని ఆరా తీసుకొని వారం రోజుల క్రితమే పథకం వేసుకొని ఇంటికి కొద్ది దూరంలో ఉన్న అజ్మతుల్లాఖాన్కు కట్టెల మిషన్ వ్యాపారం ఉంది కాబట్టి వీళ్లు బాగా ఆర్థికంగా ఉన్నవారుగా గుర్తించాడు. అతడి కుమారుడు రజాఖాన్(11)తో సన్నిహితంగా ఉండసాగాడు. రజాఖాన్ చాలాకాలంగా ముంబయిలో ఉంటూ ఈ మధ్య కాలంలో కొడంగల్‌కు వచ్చాడు. రోజూ బాలుడికి చాక్లెట్ వంటి వాటిని ఇప్పించి తన దగ్గరకు రప్పించుకునే ప్రయత్నం చేశాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు రోజు మాదిరిగానే సైకిల్ తీసుకొని బయట ఆడుకునేందుకు వెళ్లాడు. బాలుడిని అపహరించాలని కాచుకున్న అజయ్.. సమయాన్ని చూసి బాలుడిని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. మీ తల్లిదండ్రులను బెదిరించి డబ్బులు తెప్పించేందుకు సహకరించాలని రాజాఖాన్కు తెలుపడంతో రజాఖాన్ పరిస్థితిని గమనించి పెద్దగా అరిచాడు. దీంతో కోపంతో ఇనుప సుత్తిని తీసుకొని తలపై బలంగా కొట్టడంతో బాలుడి మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఓ సూట్‌కేస్‌లో ఉంచి పట్టణ శివారులో పడేసినట్లు ఎస్పీ వివరించారు.
గతంలో ఈ వ్యక్తిపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం చేసుకు నమోదైనట్లు తెలిపారు.బాలుడి కిడ్నాప్‌పై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. పోలీసు యంత్రాంగం బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనుమానంగా 30న రాత్రి అజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు వివరాలు తెలుసుకొని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు.హత్యకేసులో ఇంకా ఎవరైన సహకరించారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. 24 గంటల్లో పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ శంకర్, స్థానిక ఎస్ఐ రవితోపాటు సిబ్బంది కేసును ఛేదించగా.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.బాలుడి హత్య చాలా బాధాకరమని, త్వరలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘటనకు సంబంధించి ఎవరూ భయాందోళనకు గురి కావద్దని, పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భారీ బందోబస్తు నడుమ మృతదేహాన్ని ఇంటికి చేర్చి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాలుడి దారుణ హత్యతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలుడి కిడ్నాప్.. దారుణ హత్య జరిగిన సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. ఎటువంటి సంఘటనలు జరుగకుండా పోలీసులు పూర్తి భద్రతా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో డీఎస్పీలు శేఖర్‌గౌడ్, సీసీఎస్ సీఐ అప్పయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.