పరిగి, అక్టోబర్ 30: గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీలోనే కొనసాగుతానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఆదివారం పరిగిలోని తమ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నందకుమార్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదని, అతడితో తనకు పరిచయం లేదని.. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడిన సందర్భాలూ లేవన్నారు. కావా లంటే తన ఫోన్ కాల్‌డేటాను కూడా పరిశీలించొచ్చని సూచించారు. స్వామిజీ, ఇతరులు మాట్లాడుకున్న ఆడియోలో టీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానని నందకుమార్ మాట్లాడినట్లు ఉన్న ఆడియోను తాను విన్నానని చెప్పారు. మా నాన్న టీడీపీలో ఉండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, తాను 2012లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నూతన రా ష్ట్రంగా ఏర్పాటై గత ఎనిమిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడి ప్రభుత్వాలను పడగొట్టి, ఏదో విధం గా అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందు కు.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నాయకులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని..ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఓటమి ఖాయమని తేల డంతోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరోసారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ జెండా ఎగురుతుందన్నారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు తెలంగాణలో సాగవని.. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు, నాయకులు డబ్బులకు అమ్ముడుపోరని తేల్చిచెప్పారు. సమావేశంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, చిగురాల్‌పల్లి, యాబాజీగూడ సర్పంచ్‌లు వెంకటయ్య, ప్రవీణ్, కౌన్సిలర్లు రవీంద్ర, నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్, హన్మంత్‌రెడ్డి, తాహెర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.