సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం తొలిమెట్టు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 1-5 తరగతి విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపునకు శిక్షణ ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 980కి పైగా ప్రాథమిక పాఠశాలల్లో ‘తొలిమెట్టు’ను అమలు చేస్తున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 767 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 40,402 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగనున్నది. ఒక్కో విద్యార్థిని పరీక్షించి వారి స్థాయిని బట్టి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ప్రధానంగా ఫండమెంటల్ లిటరసీ & న్యూమరసీ(అక్షరాస్యత పునాది, సంఖ్యాశాస్త్రం)పై తర్ఫీదు ఇస్తున్నారు. పిల్లలు సొంతంగా చదివేలా, రాసేలా ఉపాధ్యాయులు బోధన చేయడంతోపాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 28, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కార్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రాష్ట్రంలోని 23,179 ప్రాథమిక పాఠశాలల్లో ‘తొలిమెట్టు’ ప్రారంభమైనది. జిల్లాలోని 81 మంది హెచ్ఎంలకు నోడల్ అధికారులుగా శిక్షణ అందించారు. మొత్తం 980కి పైగా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి ‘ఎఫ్ఎల్ఎన్’ (ఫండామెంటల్ లిటరసీ & న్యూమరసీ) ‘అక్షరాస్యత పునాది & సంఖ్యాశాస్త్రం’ ని అందుబాటులోకి తెచ్చారు. పిల్లలు తమ సొంతంగా చదివేలా, రాసేలా, ఇంకా చదివిన దానిని అర్థం చేసుకునేలా నైపుణ్యాలను ‘ఫండామెంటల్ లిటరసీ’లో భాగంగా వృద్ధిలోకి తెస్తున్నారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం లెక్కలు చేసేలా ప్రత్యేకంగా బాల బాలికలకు వాటిని ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయుల వారీగా సమీక్ష, మండల స్థాయిలో నెలకొకసారి హెచ్ఎంలతో సమీక్ష, జిల్లా స్థాయిలో మండలాల వారీగా సమీక్ష, రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ‘తొలిమెట్టు’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది.
ఇప్పటి వరకే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు జూలై మాసంలో 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అదే మాసంలో జిల్లావ్యాప్తంగా 26 నుంచి 28 వరకు తర్ఫీదును ఇచ్చారు. మండల వ్యాప్తంగా జూలై 30 నుంచి ఉపాధ్యాయులకు ఆయా అంశాల్లో శిక్షణను ఇస్తున్నారు. రోజు వారి బోధనా తరగతుల్లో ఏడాది మొత్తం ‘ఎఫ్ఎల్ఎన్’ను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతాయుతంగా ఉన్నారు. కాగా, విషయ బోధన ఉపాధ్యాయుడు తన అంశంలో బాధ్యతాయుతంగా ఉన్నారు. ఇందులో వార్షిక ప్రణాళిక, వార పాఠ్య ప్రణాళిక, ఇంకా పీరియడ్ ప్లాన్స్ తప్పనిసరిగా ఉన్నాయి. ఇందులో ఒక పీరియడ్‌ను ప్రతి రోజూ గ్రంథాలయం కోసం కేటాయించారు. పిల్లల్లో అక్షరాస్యత, సంఖ్యా శాస్త్ర స్థాయిలను తెలుసుకునేందుకు ఆధారిత టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు.
మౌఖిక భాషాభివృద్ధి
డీకోడింగ్
ధారాళ పఠనం
పఠనంతో పాటు గ్రహణశక్తి
రాయడం
ముందస్తు సంఖ్యా భావనలు
సంఖ్య, సంఖ్యలపై కార్యకలాపాలు
ఆకృతులు, ప్రాదేశిక అవగాహన
కొలతలు
డేటా హ్యాండ్లింగ్
పిల్లల్లో వెనుకబాటుతనాన్ని పారదోలి, వారిని ప్రగతి పథంలోకి తీసుకువచ్చేలా ‘తొలిమెట్టు’కు జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. ప్రాథమిక పాఠశాల పరిధిలోని విద్యార్థుల అవగాహన, గ్రహణ శక్తిని బట్టి ఒక్కో విద్యార్థికి ప్రతి విషయంలో బోధనను నిర్వహిస్తున్నాం.
– సుశీందర్ రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
వికారాబాద్, అక్టోబర్ 28 : చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భాష, ఇంగ్లిష్, గణితశాస్ర్తాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు, తండాల్లో సైతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతున్నది. జిల్లాలో 767 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 40,402 మంది విద్యార్థులు ఉన్నారు. 2,400 మంది ఉపాధ్యాయులతో విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందిస్తున్నారు. కలెక్టర్, జిల్లా విద్యాధికారి, నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులలో చదువుపై దృష్టి పెంచేందుకు పాఠశాలల్లో గ్రంథాలయాలు, ప్రయోగాలు, చిత్రాలు, అవసరమైన పరికరాలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల సామర్థ్యాలు కొంత మేరకు మెరుగు పడ్డాయి. ఉపాధ్యాయులు సైతం (టీఎల్ఎం) పరికరాలు ప్రయోగాలు, చాట్స్లు తయారు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు లెసెన్ ప్లాన్ల ఆధారంగా విద్యాబోధన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యా ప్రమాణాలను మెరుగు పరుస్తున్నారు. విద్యాశాఖ జిల్లాలోని 767 ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 40,402 మంది విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల పరిధిలోని 2,400 మంది ఉపాధ్యాయులకు మండల స్థాయిలో గత నెలలోనే విడుతల వారీగా శిక్షణ పూర్తయింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మౌలిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలు, లిట్రసీ, ఫౌండేషన్ న్యూమరసీని మెరుగుపరిచేలా బోధిస్తున్నారు.
తొలిమెట్టు చైర్మన్‌గా కలెక్టర్ నిఖిల వ్యవహరిస్తున్నారు. మండలాల్లో కాంప్లెక్స్ హెచ్ఎంలు పర్యవేక్షకులుగా, సీనియర్ హెచ్ఎంలు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తూ సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదివరకే కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మారుమూల గిరిజన తండాల్లోనూ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
‘తొలిమెట్టు’ను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచుతున్నాం. భాష, ఇంగ్లిష్, గణిత శాస్ర్తాలపై పట్టు ఉండేలా చూస్తున్నాం. విద్యాబోధనకు చాట్స్, ప్రయోగాలు, లెసన్ ప్లాన్ల ఆధారంగా విద్యాబోధన చేస్తున్నారు. కార్యక్రమాలను కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు, నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్ జిల్లా