అటవీ భూముల సంరక్షణకు వికారాబాద్ జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సర్వే చేసి హద్దుల ఏర్పాటుపై దృష్టి సారించారు. అంతేకాకుండా కబ్జాలకు తావులేకుండా ఫెన్సింగ్, కందకాల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో అటవీ భూముల సర్వే కొనసాగుతుండగా, త్వరలో జిల్లా అంతటా చేపట్టనున్నారు. జిల్లాలో 95 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులుండగా.. 1.12 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ప్రస్తుతం 1191 కిలోమీటర్లలో అటవీ భూములకు హద్దులుండగా, మరోసారి సర్వే చేసి ఫైనల్ హద్దులను గుర్తించనున్నారు. అలాగే కబ్జాలకు చెక్ పెట్టేందుకు ఫారెస్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు కందకాలను తవ్వించనున్నారు. ఇప్పటికే అనంతగిరి అటవీ ప్రాంతంలో రూ.4 కోట్లతో 17 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు పనులు చేపట్టగా.. కొంతమేర పూర్తయ్యాయి. మరోవైపు అడవిలో నీటి నిల్వలు పెంచడంపైనా అటవీ శాఖ దృష్టి సారించింది. వాగులున్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఇంకుడు, నీటిఊట గుంతలను నిర్మించాలని నిర్ణయించింది.
వికారాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. అటవీ భూ ములు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్‌తోపాటు కందకాలను తవ్వించడంతోపాటు సర్వేచేసే హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో అటవీ భూములుండగా, కొంతమేర కబ్జాకు గురైనట్లు, కబ్జాలకు పాల్పడిన వారు ప్రతి ఏటా కొంత భూభాగాన్ని దున్నుతూ అటవీ భూమిని ఆక్రమిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అటవీ భూములను సర్వేచేసి అటవీ, రెవె న్యూ శాఖల ఆధ్వర్యంలో ఎంతభూమి ఉన్నదో నిర్ణయించి హద్దులను ఏర్పాటు చేయనున్నారు. హద్దుల ఏర్పాటుతో భవిష్యత్తులో కబ్జాలకు చెక్ పడనున్నది. జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పలు మండలాల్లో అటవీ భూముల సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా.. జిల్లా అంతటా సర్వే చేసి అటవీ భూములు ఇకపై అన్యాక్రాంతం కా కుండా హద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటవీ శాఖ గుర్తించిన ప్రకారం జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 1,191 కిలోమీటర్లలో అటవీ భూములకు హద్దులుండగా, మరోసారి సర్వే నిర్వహించి ఫైనల్ హద్దులను గుర్తించనున్నారు.
జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 1.12 లక్షల ఎకరాలుండగా 95 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులున్నాయి. అయితే జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఫెన్సింగ్లతోపాటు కందకాలను తవ్వించనున్నారు. ఇప్పటికే అనంతగిరి అడవిలో ఫెన్సింగ్‌కు సంబంధించిన పనులు రెండు ప్రాంతా ల్లో పూర్తికాగా పనులు తది దశకు వచ్చాయి. అయితే అనంతగిరి అటవీ ప్రాంతంలోని 17 కిలోమీటర్లలో సుమారు రూ.4కోట్లతో ఫెన్సింగ్ ఏర్పా టు చేయాలని అధికారులు నిర్ణయించారు. అదే విధంగా జిల్లా అంతటా కందకాలను తవ్వించాలని నిర్ణయించారు.
వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతూ కొన్ని వన్యప్రాణులు రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొనడంతో మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతా ల్లో నీటి నిల్వలను పెంచాలని నిర్ణయించారు. వాగులున్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, నీటి ఊట గుంతలను నిర్మించనున్నా రు. అదేవిధంగా అటవీ ప్రాం తాల్లోని కాలువలపై రాతికట్టాలు, చిన్నకుంటలు, పెద్ద కుంటలను కూడా నిర్మించనున్నారు.
అటవీ భూముల సంరక్షణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా అటవీ భూముల సర్వేను చేప ట్టాం. ఇప్పటికే పలు మండలాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా, మిగతా మండలాల్లోనూ త్వరలో ప్రారంభం కానున్నది. సర్వే చేసి భూములు కబ్జాలకు గురి కాకుండా ఉండేందుకు హద్దులను కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అటవీ భూములను కబ్జా చేసి నిర్వహిస్తున్న రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల పరిసర ప్రాంతాల్లో సర్వే చేపట్టి ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారి, వికారాబాద్ జిల్లా