రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మాట ఇచ్చినడంటే.. నిలబెట్టుకోవడం ఆయన ప్రత్యేకత.. హామీ ఇస్తే నెరవేర్చడం ఆయన నైజం.. అందుకే అభివృద్ధికి, సంక్షేమానికి మారుపేరుగా నిలిచారు సీఎం కేసీఆర్.. రంగారెడ్డి, వికారాబాద్ నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఆ హామీని నెల రోజుల్లోనే నెరవేర్చుతూ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున రంగారెడ్డి జిల్లాకు రూ.80 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.40 కోట్లను నిధులివ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ నూ తన కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సమయంలో ప్రత్యేక నిధులిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు ప్రభుత్వం మంగళవారం నిధులను మంజూరు చేసింది. అయితే ప్రతి నియోజకవర్గానికీ రూ.5 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులను ఇస్తుండగా, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికీ రూ.10 కోట్ల చొప్పు న నిధులిస్తామని ప్రకటించిన నెల రోజుల్లోనే నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాలకు రూ.80 కోట్ల నిధులు, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఒక్కో నియోజకవర్గానికీ రూ.10 కోట్ల చొప్పున రూ.40 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.120 కోట్లను మంజూరు చేయగా.. ఆ నిధులను ఆయా నియో జకవర్గాల్లోని అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగించనున్నారు. ఇందులో అధిక ప్రాధాన్య త ఎస్సీ, ఎస్టీ జనాభా గల ప్రాంతాలకు ఇవ్వనున్నా రు. గిరిజన తండాలతోపాటు ఎస్సీ కాలనీల్లో సీడీపీ నిధులను కూడా అధికంగా ఖర్చు చేయనున్నారు. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారం గా నిధులను తండాలు, ఎస్సీ కాలనీలు, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు అదేవిధంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. గిరిజన తండాల అభివృద్ధికి 10 శాతం నిధులను, ఎస్సీ కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కో సం 20 శాతం మేర నిధులను వినియోగించనున్నారు. అదేవిధంగా సీడీపీ నిధుల్లో 40 శాతం వరకు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించాల్సి ఉం టుంది. ఆ నిధులతో విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మరుగుదొ డ్లు, మూత్రశాలలు, ఆట స్థలాల అభివృద్ధి, సైన్స్ ప్రయోగశాలలు, తాగునీరు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, వసతులు,ప్రభుత్వాసుపత్రుల మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు.
ప్రత్యేక నిధుల మంజూరు హర్షణీయం
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నిధులు మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సమయంలో ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికీ రూ.10 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. -డా.జి.రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ
ప్రభుత్వం మంజూరు చేసిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అత్యవసర పనులను పూర్తి చేస్తా. గత రెండేండ్లుగా జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నది. దీం తో చాలావరకు అత్యవసరంగా చేపట్టాల్సిన చిన్న, చిన్న పనులను పూర్తి చేయించలేకపోయాం. సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికీ రూ.10 కోట్ల చొప్పున నిధులను మం జూరు చేయడాన్ని స్వాగతిస్తున్నా.
– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎల్బీనగర్
ఈ నిధులను గిరిజన తండాల అభివృద్ధికి 10 శాతం, ఎస్సీ కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు 20 శాతం మేర వినియోగించనున్నారు. సీడీపీ నిధుల్లో 40 శాతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, ప్రభుత్వాసుపత్రుల మరమ్మతులకు మిగతానిధులను ఖర్చు చేయనున్నారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల అభివృద్ధికి రూ.120 కోట్ల నిధులు మంజూరు చేశారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మాట తప్పకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో ఆర్థిక శాఖ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.