ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 16 : నాలుగురోజులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు పెద్ద ఎత్తున వరదనీరు పోటెత్తింది. దీంతో పెద్దచెరువు అలుగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. పెద్దచెరువు అలుగునుంచి వచ్చిన వరదనీరు శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సాగర్హ్రదారిని జలదిగ్బంధంలో ముంచెత్తింది. సాగర్ రహదారిపైకి పెద్ద ఎత్తున నీరు చేరటంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాగర్ రహదారిపై ఉన్న బ్రిడ్జికి గోతిపడటంతో ఎప్పుడు తెగిపోతుందన్న భయాందోళనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
దీంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వరదను మరోప్రాంతానికి మళ్లించారు. వాహనాలను కూడా కోహెడ ఎక్స్‌రోడ్డు నుంచి చింతపల్లిగూడ, మలిశెట్టిగూడ మీదుగా ఇబ్రహీంపట్నంకు మళ్లించారు. అనంతరం మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరువ తీసుకుని సాగర్ రహదారిపైకి వచ్చే వరదను మరోప్రాంతానికి తరలించి వాహనాల రాకపోకలను పునరుద్ధ్దరించారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో సుమారు 6 వరకు గ్రూప్-1 అభ్యర్థుల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రహదారి స్తంభించి పోవటంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రమాదకరస్థాయిని దాటిన ప్రవాహం
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు అలుగు పెద్ద ఎత్తున పారుతుండటంతో ఈ వర్షపునీరు శేరిగూడ చెక్‌డ్యాం, తట్టిఖానా చెక్‌డ్యాం నుంచి ఇం దిరాసాగర్కు వెళ్తున్నాయి. దీంతో ఈ చెక్డ్యాంలన్ని నిండి ప్రమాదంగా ప్రవహిస్తున్నాయి. అలాగే మంగల్‌పల్లి పులిందర్‌వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇబ్రహీంపట్నం పెద్దవాగు, రాచకాల్వ, అలాగే, నోముల -మంచాల గ్రామా ల మధ్య గల పలు కుంటలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, పోల్కంపల్లి, దండుమైలారం, మంచాల మండలంలోని ఆరుట్ల పెద్దబంధం, చిన్నబంధం, ముదిరెడ్డిచెరువు, యాచారం మండలంలోని మేడిపల్లి సాలిచెరువు, చింతపట్ల కాముని చెరువు, నందివనపర్తి చెరువుల పొంగి ప్రవహిస్తున్నాయి.