యాచారం, అక్టోబర్16: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు తలారి మల్లేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికలో ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపును ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీని గెలిపిస్తాయన్నారు. రాష్ర్టాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ఒరిగేదేమీలేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలనుంచి యువకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలన్నారు. జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాషా, నాయకులు యాదయ్య, సుభానీ, హబీబ్, మండలి గోపాల్, సంపత్‌కుమార్ తదితరులున్నారు.
పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు..
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామానికి చెందిన పలుపార్టీల నాయకులు 35 మంది ఎమ్మెల్యే సమక్షంలో ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, నాయకులు అమరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేశ్‌గౌడ్, మోహన్, హరినాయక్, వెంకటేశ్, నాగరాజు, యాదగిరి, శంకర్‌నాయక్, ప్రశాంత్ తదితరులున్నారు.