సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చుక్కా నీరు లేక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమయత్సాగర్ తల్లడిల్లేవి. కానీ ప్రసుత్తం కురుస్తున్న వర్షాలతో సీన్ మారింది. గడిచిన నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో అవి పూర్తిగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. 15ఏండ్ల తర్వాత గత 15 రోజు లుగా రిజర్వాయర్ల నుంచి నీటిని మూసీలోకి
అధికారులు విడుదల చేస్తూనే ఉన్నారు. దీంతో సిటీ జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పెరుగుతున్న వరద నీటి ప్రవాహంతో రెండు రిజర్వాయర్ల ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత 15 ఏండ్ల తర్వాత తొలిసారిగా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏటా వానకాలంలో మూడు రోజులకు మించి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయలేదు. 2018-19లో ఏకంగా నీరు లేక ఎండిపోయాయి. వం దేండ్ల తర్వాత 2020లో మహానగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన సందర్భంలోనూ ఐదు రోజులు మాత్రమే నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 300 క్యూసెక్కుల వరద నీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతున్నది. సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటివరకు రెండు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.
క్యాచ్మెంట్ ఏరియాలో..
ఉస్మాన్‌సాగర్, హిమయత్సాగర్ రిజర్వాయర్లు 18 మండలాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. కాగా క్యాచ్మెంట్ ఏరియాల్లో ఉన్న చెరువులు, కుంటలు అన్ని కూడా గతేడాది నుంచే నిండి ఉన్నాయి. ఈసారి సీజన్ ప్రారంభం నుంచే కుండపోత వానలతో వరద నీరు నిల్వ చేసుకు నే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెం డు రిజర్వాయర్లకు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వరద నీరు చేరుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏడాది పొడవునా తగ్గని నీటి మట్టం
ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 3.9 టీ ఎంసీలు కాగా హిమయత్సాగర్ నీటిమట్టం 2.9 టీఎంసీలు. ప్రస్తుతం రెండు జలాశయాలు పుల్ ట్యాంక్ లెవల్లో కొనసాగుతున్నాయి. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 3,785 టీఎంసీల నీరు ఉండగా నాలుగు గేట్లను ఎత్తి 1,700 క్యూసెక్కులు, హిమయత్సాగర్లో 2,784 టీఎంసీల మేర నీరు ఉండగా రెండు గేట్లను ఎత్తి 695 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.