పరిగి, మార్చి 17 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి స్పెషల్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం రూపొందించిందన్నారు. జిల్లాలో మొత్తం 371 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సిద్ధం చేసేందుకు అవసరమైన 12 అంశాలపై ప్రతిపాదనలు సోమవారం వరకు సిద్ధం చేయాలన్నారు. సెలవు రోజుల్లో సైతం పనిచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లు అందుబాటులో ఉండేలా చూడాలని విద్యా శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.