కొత్తూరు, అక్టోబర్ 9 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కొత్తూరు అభివృద్ధి చెందిన మున్సిపాలిటీలతో పోటీపడింది. స్వచ్ఛత, పరిశుభ్రతలతో భేష్ అని నిరూపించుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 15,000 జనాభా గల కేటగరిలో భాగంగా దక్షిణ భారతదేశంలోని 350 పురపాలక సంఘాలకుగాను కొత్తూరు మున్సిపాలిటీ 12వ ర్యాంకు సాధించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గల 12 మున్సిపాలిటీలకుగాను 10వ ర్యాంకు తెచ్చుకుంది. సిటిజన్ వాయిస్, సిటిజన్ ఎంగేజ్మెంట్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్, ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ శానిటేషన్, ఓడీఎఫ్ సర్టిఫికేషన్ (పబ్లిక్ టాయిలెట్స్), గార్బేజ్ ఫ్రీ సిటీ, డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ తదితర అంశాల్లో కొత్తూరు మున్సిపాలిటీ మంచి ప్రతిభ కనబర్చి ఈ ర్యాంకు సాధించింది.
గతంలో గ్రామపంచాయతీగా ఉన్న కొత్తూరు మున్సిపాలిటీ ఏర్పడి ఏడాదిన్నర అయింది. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పనిచేయడంవల్లే కొత్తూరును పరిశుభ్రంగా తీర్చిదిద్దగలిగారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో పరిశుభ్రతకు, పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో అనేక కాలుష్య పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం నుంచి ప్రజలకు రక్షించడానికి హరితహారానికి ప్రాముఖ్యతనిచ్చారు. రెండు పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి అనేక మొక్కలు పెంచుతున్నారు. ఖాళీ ప్రదేశాలు, రోడ్డు వెంబడి, ఇంటి పరిసరాలు.. ఇలా ఎక్కడ అవకాశం ఉన్నా మొక్కలు పెంచారు, పెంచేందుకు ప్రోత్సాహాన్ని కల్పించారు. ఇక పరిశుభ్రత విషయానికి వస్తే చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లతోపాటు 4 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. రూ.15 లక్షలతో అంతర్గత మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేశారు. రూ.40 లక్షలతో అంతర్గత డ్రైనేజీలను నిర్మించారు.
కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రజలు, ప్రజాపతినిధులు, అధికారులు సహకరించడంవల్లే ఈ ఘనత సాధించాం. ముఖ్యంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతోనే మున్సిపాలిటీకి నిధుల కొరత లేదు. మాకు ఏం కావాలన్న ఎమ్మెల్యేగారు సమకూర్చుతున్నారు. దీంతో 350 మున్సిపాలిటీలతో పోటీపడి 12వ ర్యాంకు సాధించగలిగాం. మున్సిపాలిటీని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాం.
– బాతుక లావణ్య, మున్సిపల్ చైర్పర్సన్
కొత్తూరు మున్సిపాలిటీలో పరిశుభ్రతను ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ప్రతిరోజూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నాం. నిరంతరం ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలను తీసుకుని అందుకనుగుణంగా పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. అందుకు కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఎంతగానో సహకరిస్తున్నది.
– వీరేందర్, మున్సిపల్ కమిషనర్