వికారాబాద్ జిల్లాలో 8,403 ఎస్‌హెచ్‌జీలకు రూ.372 కోట్ల రుణాలు
నాలుగు మున్సిపాలిటీల్లో 361 సంఘాలకు రూ.21.89కోట్లు
విలేజ్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18కోట్లు
బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేత
రుణాల రికవరీ రేటు 95శాతం
పరిగి, మార్చి 16 : మహిళల ఆర్థికాభివృద్ధితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందస్తున్నది. సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతో బ్యాంకర్లు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.365.05కోట్ల్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు జిల్లాలో 8,403 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.372.60కోట్లు అందించారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే లక్ష్యం కంటే అదనంగా రుణాలు ఇచ్చారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్దేశించిన లక్ష్యం దాటి 102శాతం వరకు రుణ అందించడం గమనార్హం.
విలేజ్ మార్ట్‌లకు రూ.18కోట్లు రుణాలు
జిల్లా పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు విలేజ్మార్ట్లను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 2047 యూనిట్లకు రూ.18కోట్లు అందజేశారు. ఇందులో కిరాణం దుకాణం, ఆటో, ఆటోమొబైల్స్, బేకరీ, బ్యాంగిల్ స్టోర్, బైక్ మెకానిక్, కార్, కార్పెంటర్, దాబా, దాల్మిల్, జిరాక్స్ సెంటర్, ఎలక్ట్రికల్ షాప్ ఇలా వంద పైచిలుకు వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సంఘం నుంచి అదనంగా మరో 5 యూనిట్లు ఎంపిక చేసి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా.. ఇప్పటికే పంపించారు. వారికి ఒక్కో యూనిట్‌కు రూ.2లక్షల రుణం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాలుగు మున్సిపాలిటీలు.. రూ.21.89కోట్లు..
జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో రూ.21.89 కోట్ల రుణాలు అందజేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 121 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.8.42కోట్లు, తాండూరులో 127 సంఘాలకు రూ.7.64కోట్లు, పరిగిలో 64 సంఘాలకు రూ.2.99కోట్లు, కొడంగల్‌లో 49 సంఘాలకు 2.84కోట్లు పంపిణీచేశారు. ఈ సంవత్సరం మున్సిపాలిటీల్లో రూ.17.76కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికీ 361 సంఘాలకు రూ.21.89కోట్లు(123శాతం) అందజేశారు.
జిల్లాలో 95శాతం రికవరీ రేటు
జిల్లా పరిధిలో బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు 95శాతం వరకు ఉన్నది. ఇతర రుణాలతో పోలిస్తే స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేస్తున్న రుణాల రికవరీ రేటు బాగుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరు లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్నప్పటికీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతినెలా వాయిదాలు చెల్లిస్తున్నారు.
రూ.372.60కోట్లు రుణాలు ..
వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 8403 స్వయం సహాయక సంఘాలకు రూ.372.60కోట్ల రుణాలు ఇప్పించాం. ఈ నెలాఖరు వరకు మరో రూ.20కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎస్‌హెచ్‌జీల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు.రుణాలతో మహిళలు స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా రాణిస్తున్నారు.
–కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా