పోలీసు కొలువులకు సిటీలో ఆరు వేల మందికి ఉచిత శిక్షణ
కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు
బ్లూకోర్ట్స్ , సెక్టార్ ఎస్సైలకు బాధ్యతలు
గూగుల్ ఫామ్స్‌తో వివరాల సేకరణ
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్, అవుట్డోర్ శిక్షణ
ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో రోజంతా తరగతులు
ప్రత్యేకంగా మహిళలకు సెంటర్ ఏర్పాటు
ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం : సీపీ ఆనంద్
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. మీ కోసం హైదరాబాద్ పోలీసులు ఉచితంగా నాణ్యమైన శిక్షణను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి జోన్లో వెయ్యి మందికి, ప్రత్యేకంగా ఒక మహిళా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణకు వచ్చే వారికి అనుకూలంగా ఉండే విధంగా ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో ఉదయం, సాయంత్రం, రోజంతా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శిక్షణ తీసుకోవాలనుకునే వారు వారి పేర్లను నమోదు చేసుకోవడానికి హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లో గూగుల్ ఫామ్ లింక్‌ను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శిక్షణ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శిక్షణకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయా జోనల్ డీసీపీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇండోర్.. అవుట్డోర్ శిక్షణ
పోలీస్ శాఖలో సుమారు ఎస్సై, కానిస్టేబుళ్లకు సంబంధించిన 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నది. ఇందులో భాగంగా సిటీ పోలీసులు నిరుద్యోగ యువతకు అనుభవజ్ఞులైన బోధన బృందంతో నాణ్యమైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాత పరీక్ష(ఇండోర్)తో పాటు ఫిజికల్ పరీక్ష(అవుట్ డోర్)లోను శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవుట్ డోర్లో శిక్షణకు ఆయా జోన్లలో అనువైన గ్రౌండ్లను ఎంచుకొని, స్పోర్ట్స్‌లో అనుభవం ఉన్న కార్(సిటీ ఆర్ముడ్ రిజర్వు ఫోర్స్) సిబ్బంది, పోలీస్ శాఖలోని ఇతర అధికారులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా గ్రౌండ్ల వద్ద శిక్షణకు వచ్చే స్త్రీ, పురుషులకు వేరు వేరుగా మరుగుదొడ్లు ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
గూగుల్ లింక్‌తో సమాచారం
పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే సెక్టార్ ఎస్సై, బ్లూకోర్ట్స్ సిబ్బంది నిరుద్యోగ యువతకు అవగాహన కల్పిస్తారు. క్షేత్ర స్థాయిలో ఉండే ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది కాలనీలు, బస్తీలలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే నిరుద్యోగ యువతను గుర్తించి పోలీస్ శాఖ ఇస్తున్న ఉచిత శిక్షణ గురించి వివరిస్తారు. శిక్షణలో చేరేందుకు ముందుకువచ్చే వారు తమ వివరాలను హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్లో పొందుపర్చేలా సూచిస్తారు. ఇదిలాఉండగా శిక్షణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా తమ వంతు సహకారం అం దించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించే శిక్షణ కేంద్రాలలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణకు వచ్చే వారికి కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించేందుకు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తాం. ఈ పరీక్షలతో ఎవరికి ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయనే విషయం తెలుస్తుంది. పరీక్షలు నిర్వహించి వారికి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో శిక్షణ కేంద్రాలు కొనసాగుతాయి. హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.