ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఊరూరా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడిపాడారు.‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయే చందమామా..’ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ పాటలతో సందడి చేశారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఊరూవాడా వైభవంగా బతుకమ్మ సంబురాలు వేడుకల్లో పాల్గొన్న మహిళలు, చిన్నారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలను ఆదివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సంస్కృతిని చాటారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ