యాచారం, జూలై 31 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని నజ్దిక్‌సింగారం రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో పరుగులు తీస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.3కోట్లతో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనం, కంపోస్టు యార్డు, వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేశారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. 100శాతం మరుగుదొడ్లు నిర్మించడంతో శుభ్రతతో పాటు స్వచ్ఛత నెలకొంది. నర్సరీలో మొక్కలను పెంచడం, పల్లె ప్రకృతివనం, గ్రామంలో విరివిగా మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పెంపొందుతున్నది. 2,000ల జనాభా ఉండగా, 1,320 ఓటర్లు ఉన్నారు.
గ్రామంలో ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రోత్సాహంతో రూ.3కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.70లక్షలతో సీసీ రోడ్లు, రూ. 50లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ. 25లక్షలతో పంచాయతీ భవనంతో పాటుగా డ్వాక్రా మహిళా భవనం, రూ.10లక్షలతో మినీ ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, రూ. 12.5లక్షలతో వైకుంఠధామం, రూ.2.5లక్షలతో కంపోస్టుయార్డు, రూ.3లక్షలతో పల్లె ప్రకృతివనం తదితర పనుల నిర్మాణాలను చేపట్టారు.
గ్రామంలోని పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో పచ్చదనం వెల్లివిరిస్తున్నది. రూ.3లక్షల వ్యయంతో చేపట్టిన పల్లె ప్రకృతివనంలో వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు. పల్లె ప్రకృతివనం, హరితహారం కింద నాటేందుకు గతంలో మొక్కలను రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు. పంచాయతీ ట్యాంకర్‌తో నీరుపోసి సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో మొత్తం 600లకు పైగా మొక్కలు పెంచుతూ వాటిని సంరక్షిస్తున్నారు.
గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా కందుకూరు వెళ్లే రోడ్డులో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాయి. 5 విడుత కింద సుమారు 2వేల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను వృక్షాలుగా మార్చడమే ప్రజాప్రతినిధులు, అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారులు సఫలీకృతమవుతున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో ముమ్మరంగా మొక్కల పెంపకం చేపట్టారు. నర్సరీలో 18,000ల మొక్కలను పెంచారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చలువపందిరి వేసి నిత్యం నీరందించి, కలుపుతీసి మొక్కలను సంరక్షించారు. నర్సరీలో ఉన్న మిగతా మొక్కలను నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.
గ్రామంలో వీధిదీపాల లైటింగ్‌తో రాత్రిపూట విద్యుత్ వెలుగులు జిగేల్ మంటున్నాయి. గ్రామంలో ఉన్న 120 విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు అమర్చారు. స్తంభాలకు బల్బులు కాలిపోయిన వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది పాతవి తీసేసి వాటి స్థానంలో కొత్తవి వేస్తున్నారు. రాత్రిపూట గ్రామస్తులకు విద్యుత్ సమస్యలేకుండా పోయింది.
వైకుంఠధామాన్ని రూ.12.50లక్షల ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మించారు. ముఖద్వారం, రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, బాత్రూంలు, మూత్రశాలలు, విశ్రాంతి గదిని ఇప్పటికే నిర్మించారు. నీటి వసతి, విద్యుత్ తదితర వసతులను కల్పించారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరికో మైదానంలో భాగంగా గ్రామంలో క్రీడా మైదానాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.60వేలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్థల సేకరణ, మైదానం చదును చేసే పనులు పూర్తయ్యాయి. క్రీడాకారులు ఆడుకునే ఆట సామగ్రిని అమర్చే పనిలో అధికారులు ఉన్నారు. క్రీడా మైదానం చుట్టు కంచేతో పాటుగా ముఖద్వారాన్ని నిర్మించనున్నారు.
ఉపాధిహామి పథకం నిధులు రూ.2.50లక్షలతో కంపోస్టు యార్డును నిర్మించారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి కంపోస్టు యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. దీనిని మొక్కలకు అందించేందకు అధికారులు కృషి చేస్తున్నారు.
గ్రామంలో మొత్తం 2 మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులున్నాయి. గ్రామంలో 384నల్లాల ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన మిషన్ భగీరథ తాగునీరును సక్రమంగా అందిస్తున్నారు.
ప్రజలు, పంచాయతీ పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పల్లె ప్రగతితో గ్రామం అనేక రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. విద్యుత్, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. పల్లెప్రగతిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం సూచించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, కంపోస్టుయార్డు నిర్మాణ పనులను పూర్తి చేశాం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తాం.
– వన్నవాడపు అరుణమ్మ సర్పంచ్, నజ్దిక్‌సింగారం
గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయం. గ్రామాభివృద్ధికి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించాలి. సర్పంచ్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలి. ప్రతి రంగంలో గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు మరింతగా కృషి చేస్తాం. సమస్యలు నెలకొన్నప్పుడు పంచాయతీ పాలక వర్గం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.
– వరప్రసాద్‌రెడ్డి, ఉపసర్పంచ్, నజ్దిక్‌సింగారం
గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అన్ని విధాలుగా సహకరించాలి. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. రోడ్లపైన చెత్త వేయకుండా తడి,పొడి చెత్త బుట్టలను ఉపయోగించాలి. ఇంటికో మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామస్తులు కృషి చేయాలి. గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యతనివ్వాలి. గ్రామంలో ఎలాంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తా.
– మేఘన, పంచాయతీ కార్యదర్శి, నజ్దిక్‌సింగారం