వికారాబాద్/ధారూరు, జూలై 31 : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు, వాటర్ ఫాల్స్, ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. సెలవుదినం కావడంతో పలువురు కుటుంబ సమేతంగా వచ్చారు.
ముందుగా శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం అనంతగిరి అటవీ అందాలను ఆస్వాదించారు. జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ తదితర జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. యువతీయువకులు పోటీపడి ట్రెక్కింగ్ చేశారు. నందీఘాట్ వద్ద సెల్ఫీలు దిగుతూ, కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ రోజంతా సరదాగా గడిపారు. చుట్టుపక్కల పరిసరాలు సందర్శకులతో సందడిగా మారాయి.