బొంరాస్పేట/కొడంగల్, జూలై 31 : తల్లిపాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దీనిపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాన్పు కాగానే పుట్టిన బిడ్డకు తల్లిపాలు(ముర్రుపాలు)ను ఇవ్వరు.
దీనిపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆ తరువాత కూడా తల్లిపాలను ఇవ్వడం తగ్గించి మార్కెట్లో లభించే డబ్బా పాలను పడుతుంటారు. దీని ఫలితంగా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తరువాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి అనేక రకాల వ్యాధులు చిన్న పిల్లలను పట్టి పీడిస్తాయి. తల్లిపాలపై ప్రజల్లో ఉన్న అపోహాలను పోగొట్టి పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తల్లిపాల వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీనిపై నమస్తే తెలంగాణ కథనం.
ప్రస్తుతం మన దేశంలో పిల్లలకు నిర్ధేశించిన రీతిలో పిల్లలకు తల్లిపాలు అందడం లేదు. పుట్టిన గంటలో కేవలం 41శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలకు భవిష్యత్లో అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అంటారు వైద్య నిపుణులు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయి. తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి.
తల్లిపాలలో కొలస్ట్రం అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి ఇమ్యునోగ్లోబిన్గా పనిచేస్తున్నది. దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేండ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి.
అదే విధంగా పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ, డయాబెటీస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలను తప్పక ఇవ్వాలని వైద్యులు స్పష్టం చేస్తుంటారు.
తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల ఒక బిడ్డ ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లీ బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. ప్రసవం తరువాత మహిళలు సాధారణంగా నెల రోజుల వరకు రక్తస్రావంతో బాధపడుతుంటారు. కానీ తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల దీనిని నివారించవచ్చు.
అదేవిధంగా కొందరు కాన్పు అయిన తరువాత వెంటనే మళ్లీ గర్భం రాకుండా గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటుంటారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇది గర్భనిరోధక సాధనంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. మహిళలు ఇటీవలి కాలంలో రొమ్ము, అండాశయ క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటికి ఒక కారణం తల్లులు బిడ్డకు పాలివ్వకపోవడమేనని తేలింది. ఈ వ్యాధుల బారిన పడిన వారిపై నిర్వహించిన పలు సర్వేల్లో ఎక్కువ మంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వని వారేనని ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు కలుపుకుని మొత్తం 1106 కేంద్రాలున్నాయి. వీటిలో ఏడు నుంచి మూడేండ్లలోపు పిల్లలు 32,759 మంది, 3 నుంచి 6ఏండ్లలోపు పిల్లలు 21090 మంది ఉన్నారు. 6788 మంది గర్భవతులు, 5856 మంది బాలింతలు ఉన్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాల పరిధిలో వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడానికి టీచర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. కేంద్రాల్లో తల్లులు, గర్భిణీలు, మహిళలను పిలిపించి వారికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తారు.
బిడ్డకు తల్లిపాలకు మించిన ఆహారం మరొకటి లేదు. తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలను ఇవ్వాలి. తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయమై మా సిబ్బంది గర్భిణులకు చెబుతూనే ఉన్నారు. ముర్రుపాలపై ఉన్న అపోహాలను విడనాడాలి.
– రవీంద్ర యాదవ్, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి
తల్లిపాల ప్రాముఖ్యంపై జిల్లాలో వారం రోజులు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రామ పంచాయతీ, మండల, బ్లాక్, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
-లలితాకుమారి, జిల్లా సంక్షేమ అధికారి