హుస్నాబాద్ టౌన్, జూలై 2 : భావితరాల భవిష్యత్ కోసం ప్లాస్టిక్ వస్తువులను నిషేధిద్దామని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మానవళి మనుగడకు ఇబ్బందిగా మారుతున్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, కమిషనర్ రాజమల్ల య్య, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎన్విరాన్మెంట్ ఇం జినీర్ రవికుమార్, వర్తక, వ్యాపారులు పాల్గొన్నారు.
చేర్యాల, జూలై 2 : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించినందున ప్రజలు వాటిని వినియోగించొద్దని మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి సూచించారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై వ్యాపార, వాణిజ్య వర్గాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 75 మైక్రాన్లోపు మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదన్నారు.
జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే అమ్మకందారుడికి, వినియోగదారుడికి రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు చంటి, నరేందర్, కనకవ్వయాదగిరి, సతీశ్, మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, మేనేజర్ ప్రభాకర్, వర్తక, వాణిజ్య, రెస్టారెంట్లు, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు.
గజ్వేల్, జూలై 2 : గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామని, ఎవరూ ప్లాస్టిక్ అమ్మడం, కొనడం చేయొద్దని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కమిషనర్ విద్యాధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ, అట వీ మంత్రిత్వశాఖ ఉత్తర్వుల మేరకు 120 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్ వాడితే రూ. వెయ్యి నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పట్టణంలో ఎలాంటి వ్యాపార ప్రకటనలు, రాజకీయ పార్టీల బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని, దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.