“యాసంగి ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెట్టారు.. మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని అవహేళన చేశారు.. ఇవాళ తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఊడిపడ్డారు.. ఏం ఉద్ధరించడానికి వచ్చారు?” అని బీజేపీ జాతీయ నాయకులను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు మోదీ సభ కోసం జన సమీకరణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ జాతీయ నాయకులు రెండు రోజుల పాటు పర్యటించారు. వారు ఎక్కడికి వెళ్లినా ఎక్కడికక్కడ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు వచ్చారు..? ఏం ఉద్ధరించారని వచ్చారు..? సామాన్య ప్రజల గోడు మీకు పట్టదా..? రైతుల గోస మీకు పట్టదా..? యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతారా..? గ్యాస్, పెట్రో, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచామని చెప్పడానికి ఇక్కడికి వచ్చారా..? అంటూ మండిపడ్డారు. రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేంద్రంలోని బీజేపీని ప్రజలు చీదరించుకున్నారు.
సిద్దిపేట, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.ఉన్న కొద్దిపాటి ఆ పార్టీ నాయకుల్లో సఖ్యత కరువైంది. కుమ్ములాటలు, గుద్దులాటలతో ఇటీవల ఆ పార్టీ సమావేశాలు వాడీవేడిగా సాగి ఆ పార్టీ పరువు కాస్త బజారు పాలైంది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చేసేదేమి లేక జాతీయ నాయకులంతా రెండు ఫొటోలు, ఓ రెండు సెల్పీలు దిగి.. నాలుగు ప్రెస్మీట్లు పెట్టుకొని వెళ్లిపోయారు. ఎక్కడా వారికి ప్రజల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం చేసే పనుల గురించి చెప్పినప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. మోదీ సభకు జనం తరలించడం కష్టం అని భావించి పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక నుంచి ప్రత్యేక రైలు ద్వారా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మోదీ సభకు జన సమీకరణలో భాగంగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రానికి జాతీయస్థాయి నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గ కేంద్రాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. వీరి పర్యటనల్లో ప్రజల నుంచి చీత్కారాలు తప్ప సానుకూల స్పందన ఎక్కడా కానరాలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు పర్యటించినప్పుడు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఎక్కడకి వెళ్లినా ఆ పార్టీ నాయకులు, కొద్దిపాటి కార్యకర్తలు తప్ప ప్రజలు ఎక్కడా స్పందించిన దాఖలు లేవు. పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా , నరేంద్ర మోదీ పైనా ఈ ప్రాంత ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏ వర్గానికి మీ ప్రభుత్వం మేలు చేసిందో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకువచ్చి వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభు త్వం బీజేపీది కాదా అని రైతులు ప్రశ్నించారు. ఆరుగాలం కష్టించి పనిచేసే రైతులనే చంపిన ఘనుడు ప్రధాని మోదీ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయుమంటే నానా యాగి చేసి, తెలంగాణ ప్రాంత ప్రజలను నూకలు తినండి అని హేళనగా మాట్లాడి అవమానపరిచింది మీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాదా అని రైతులు మండిపడ్డారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదన్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో సాగు నీరు లేక పంటలు పండక తెలంగాణ రైతులు అల్లాడిపోయారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోవడంతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని, దీంతో ఉన్నో ఊర్లలోనే పంటలు పండించుకుంటున్నారని పేర్కొన్నారు. వలస పోయిన వారంతా తిరిగి తమ తమ ఊర్లోకి వచ్చి ఉంటున్నారు. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. పుట్ల కొద్ది ధాన్యం పండుతున్నది. ఇది చూసి గిట్టని బీజేపీ ప్రభుత్వం,నాయకులు రైతులపై తమ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని వారు ఆరోపిస్తున్నారు.
పేరుకు క్రమశిక్షణ పార్టీ అని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే బీజేపీ, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఆ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. ఆ ఉన్న కొద్ది పాటి నేతల్లో సఖ్యత లేక కుమ్ములాటలు, గ్రూపు తగాదాలతో మూడు ముక్కలుగా చీలిపోయింది. వారి విభేదాలు రచ్చకెక్కాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఉన్న కొద్దిపాటి నేతల్లోనే సఖ్యత లేని బీజేపీ.. ప్రజలను ఉద్దరిస్తదంట అంటూ విమర్శలు వస్తున్నాయి. రెండు రోజల పాటు బీజేపీ జాతీయ నాయకత్వం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు ఈ విషయం స్పష్టంగా బయటపడింది.
ఉన్న మూడు తోకలు సరిగా లేక గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ అంట అని బీజేపీ నాయక గణంపై స్థానిక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడానికి ఇటీవల నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆ పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. అందోల్‌లో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఇందతా అక్కడికి వచ్చిన ఇన్చార్జి ప్రేమ్‌జీ శుక్లా ముందే జరగడం విశేషం. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.
దుబ్బాక నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తీరుపై అక్కడి కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సిద్దిపేటలో మూడు ముక్కలాటలా ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఎవరికి వారే అన్నట్లు గా సొంత గ్రూప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. మోదీ సభకు జనాన్ని తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సరిహద్దును కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనసమీకరణకు రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.