షాబాద్, అక్టోబర్ 28 : జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకునేందుకు రంగారెడ్డిజిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 9 విభాగాల్లో 27 అంశాలపై అవార్డులు ఇవ్వనుండగా.. ఇందుకు దేశంలోని అన్ని పంచాయతీలు పోటీపడే అవకాశాన్ని కల్పించింది. జాతీయ స్థాయిలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ స్థాయిలో ఒక్కోదానికి 27 చొప్పున 81.. ప్రత్యేక కేటగిరీలో మరో 9 కలిపి మొత్తం 90 అవార్డులు ప్రదానం చేయనున్నది. కాగా, అవార్డుల కోసం పోటీపడేందుకు సంబంధిత అధికారులు పంచాయతీలను ఇప్పటికే సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 558 గ్రామ పంచాయతీల్లో అవార్డుల కోసం దరఖాస్తు చేసే పనిలో సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 31 వరకు కేంద్రం ఇచ్చిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. మండల, జిల్లా స్థాయిలోని కమిటీలు వీటిని పరిశీలించి జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రగతి ఆధారంగా అవార్డులు ఇస్తున్న కేంద్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జరిగే పంచాయతీరాజ్ దివస్ ఉత్సవాల్లో అవార్డులు ప్రదానం చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం అందించనున్న జాతీయ అవార్డుల కోసం గ్రామపంచాయతీలు సిద్ధమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో మొత్తం 558 గ్రామపంచాయతీలున్నాయి. ఇందులో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లకు అవార్డులు, నగదు పురస్కారాలను అందించనుంది. గతంలో పంచాయతీలకు రూ.10లక్షలు, మండల పరిషత్‌లకు రూ.25లక్షలు, జిల్లా పరిషత్‌లకు రూ.50లక్షలు నగదు పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించేది. పునరుద్ధరించబడిన పురస్కారం కింద ఇప్పుడు జిల్లా పరిషత్‌లకు రూ.1.50కోట్లు, మండల పరిషత్‌లకు రూ.కోటి, గ్రామపంచాయతీలకు రూ.50లక్షల నగదు పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో జాతీయ స్థాయిలో 27 అవార్డులు గ్రామ పంచాయతీలకు, 27 అవార్డులు మండల పరిషత్‌లకు, మరో 27 అవార్డులు జిల్లా పరిషత్‌లకు కలిపి మొత్తం 81 అవార్డులు ఇస్తున్నారు. ఇందులో ఓవరాల్‌గా అవార్డులు సాధించిన వారికి నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద 9 ప్రత్యేక అవార్డులు అందించనున్నారు. జాతీయ స్థాయిలో ఇచ్చే మొత్తం 90 అవార్డుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లు పోటీపడుతున్నాయి.
జాతీయ స్థాయిలో గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు మూడు స్థాయిల్లో అవార్డులు ప్రదానం చేస్తారు. అయితే గ్రామాలు సాధించిన అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని మండల, జిల్లా పరిషత్‌లను ఎంపిక చేస్తారు. ప్రతి పురస్కారానికి 9 విభాగాల్లో 27 అంశాలు ఉంటాయి. ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన ప్రశ్నావళిని రూపొందించి వెబ్సైట్లో ఉంచారు. వీటికి అనుగుణంగా ఫొటోలు, వీడియోలను ఆధారంగా చూపుతూ గ్రామ పంచాయతీ, ఇతర రికార్డుల ఆధారంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నివేదికలను ఎంపీడీవో చైర్మన్‌గా, ఎంపీవో కన్వీనర్‌గా, ఆయా శాఖల అధికారులు గల సభ్యుల కమిటీ పరిశీలించి.. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చైర్మన్‌గా, డీపీవో, జడ్పీ సీఈవో కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీకి సిఫారసు చేస్తారు. వీటిని పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీ రాష్ర్టానికి సిఫారసు చేస్తుంది. అక్కడి నుంచి పంపిన దరఖాస్తులను ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పరిశీలించి ఉత్తమంగా ఉన్న వాటిని అవార్డులకు ఎంపిక చేస్తుంది. గ్రామ పంచాయతీలు అప్లోడ్ చేసే వివరాలను బట్టి మండలాలకు, మండలాలు అప్లోడ్ చేసే వివరాలను బట్టి జిల్లా పరిషత్‌లకు రేటింగ్ వస్తుంది.
అవార్డుల కోసం పోటీపడే పంచాయతీలు 9 విభాగాల్లో 113 ప్రశ్నలకు ఆధారాలతో కూడిన జవాబులివ్వాలి. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి విభాగంలో 14 ప్రశ్నలు, ఆరోగ్యకరమైన విభాగంలో 14, చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో 13, సరిపడా నీరు ఉన్న విభాగంలో 13, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో 10, పంచాయతీలో స్వీయ-సమృద్ధమైన మౌలిక సదుపాయాల విభాగంలో 16, సామాజిక భద్రత కలిగిన విభాగంలో 8, గుడ్ గవర్నెన్స్ విభాగంలో 14, మహిళా స్నేహపూర్వక విభాగంలో 11 ప్రశ్నలతో కలిపి మొత్తం 113 ప్రశ్నలకు ఆధారాలతో కూడిన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక గ్రామంలో జరిగిన అభివృద్ధి, సేవలను ఆధారం చేసుకుని అవార్డుకు ఎంపిక చేస్తారు. ఒక మండలంలో ఎన్ని గ్రామాల్లో ఉత్తమ అభివృద్ధి, సేవలు అందుతున్నాయో పరిశీలించి మండల ప్రజాపరిషత్‌లను, అలాగే జిల్లాలో ఎన్ని మండలాల్లో ఉత్తమ అభివృద్ధి, సేవలను గుర్తించి జిల్లా పరిషత్‌లను ఎంపిక చేస్తారు.
జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, సేవల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవార్డులను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగే జాతీయ పంచాయతీరాజ్ దివస్ రోజున ప్రదానం చేస్తారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 558 గ్రామపంచాయతీల్లో అవార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
– శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి