ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో యోగా గురువులు యోగాసనాలు వేయించారు. యోగా ద్వారా కలిగే లాభాలపై వివరించారు. ప్రతిరోజూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. పాఠశాల స్థాయినుంచే యోగా అలవాటు చేసుకోవాలన్నారు. మొండిగౌరెల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఏపీవో లింగయ్య ఆధ్వర్యంలో యోగా ఆసనాలు వేయించారు. జిల్లెడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో ఉపాధి కూలీలకు టెక్నికల్ అసిస్టెంట్ వినోద్‌కుమార్ యోగాపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా గురువులు, ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు.
న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ, జూన్ 21