ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 20 : ప్రతిఒక్కరూ భక్తిభావం, దైవచింతనను అలవర్చుకోవాలని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహస్ర చండీయాగంలో శనివారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి దంపతులు మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు సహస్ర చండీయాగంలో పాల్గొని పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. నిత్యం పలు సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కసారైనా దేవున్ని తలుచుకోకుండా ఉండలేరన్నారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఇటీవల ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా తీర్చిదిద్దిందన్నారు. ధూప, దీప, నైవేద్యానికి నోచుకోని అనేక ఆలయాలను అభివృద్ధి చేసి ప్రజలు భక్తిపారవశ్యంలో పయనించేలాగా కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. శనివారం సహస్ర చండీయాగం, రాత్రి పద్మావతి వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. యాగానికి వచ్చే భక్తులందరికీ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. సహస్ర చండీయాగంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం హోమం అనంతరం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు.
మూడో రోజు సహస్ర చండీయాగానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ రాములు, రమేశ్, రమేశ్‌గౌడ్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, నాయకులు మహేశ్‌గౌడ్, సురేశ్, జెర్కోని రాజు, నిట్టు జగదీశ్వర్, విజయ్‌కుమార్, యాచారం రవీందర్, ముత్యాల నరేశ్, మంద సురేశ్, సుధాకర్, జగన్, మల్లేశ్, జగదీశ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.