యాచారం, ఆగస్టు 20 : మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామ శివారులో హైనాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. దీనికి సంబందించి స్థానికులు, ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథన్గౌరెల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతం సమీపంలో కొంత మంది రైతులు తమ పొలాల వద్ద పశువులు, గొర్రెలు, మేకలను మందలలో ఉంచుతారు. ఇటీవల లేగదూడలు మృతి చెంది ఉండటాన్ని గమనించి వీధి కుక్కలు దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గిరి వెంకటయ్య పొలంలోని మేకల మందలో ఏదో జంతువు దాడి చేసిన ఘటనలో నాలుగు మేకలు మృతిచెంది ఉండటాన్ని శనివారం ఉదయం రైతు వెంకటయ్య గుర్తించాడు. చుట్టుపక్కల పొలాల రైతులు, గ్రామస్తులు ఇది చిరుత పనేనని.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన మేకలను, చుట్టుపక్కల ఇతర జంతువుల ఆనవాళ్లను పరిశీలించారు. సంఘటన స్థలం చుట్టుపక్కల చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. మేకల మందపై హైనాలు దాడి చేసినట్లు గుర్తించారు. అధికారులు చర్యలు తీసుకొని హైనాల నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.