స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. ఆదివారం ఒక్కరోజే వన మహోత్సవం పేరుతో లక్షలాది మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లాలో 10 లక్షల మొక్కలు, వికారాబాద్ జిల్లాలో 5.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే గుంతల తవ్వకం పూర్తిచేసి.. సరిపడా మొక్కలను అందుబాటులో ఉంచారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 1500, మున్సిపాలిటీలో 10వేల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించారు. వనమహోత్సవంలో ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు ప్రజలు కూడా భాగస్వాములు కానున్నారు.
పరిగి, ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న వికారాబాద్ జిల్లాలో వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. 5.50లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 10న లక్ష మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 38.70 లక్షలకుగాను ఇప్పటివరకు 33,18,896 మొక్కలను నాటారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి హరితహారంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుండగా వజ్రోత్సవాల్లో పూర్తిస్థాయిలో వంద శాతం పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 24,04,603 మొక్కలు, అటవీ శాఖ 6,12,290., వ్యవసాయ శాఖ 95,000., ఉద్యాన శాఖ 70,000., పరిశ్రమల శాఖ 18,500., వికారాబాద్ మున్సిపాలిటీలో 27,050., తాండూరు మున్సిపాలిటీలో 37,292., కొడంగల్ మున్సిపాలిటీలో 27,970., విద్యా శాఖ 10,000., గనులు, భూగర్భ వనరుల శాఖ 6200., స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 4,214., పౌర సరఫరాల శాఖ ద్వారా 2,782., పరిగి మున్సిపాలిటీలో 2,995 మొక్కలు నాటారు.
ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో 5.50లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానే సుమారు 3లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఇప్పటికే పెద్ద సైజు మొక్కలను నాటారు. మిగతా రహదారులు, ఖాళీ స్థలాల్లో నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు. వన మహోత్సవాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే గుంతలను ఉపాధి హామీ కూలీలతో తవ్వించారు. ఆదివారం మొక్కలు నాటడం ద్వారా పూర్తిస్థాయిలో వాటి సంరక్షణ చర్యలు చేపట్టడానికి అధికారులు నిర్ణయించారు.
రంగారెడ్డి, ఆగస్టు 20, (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు పెద్దఎత్తున మొక్కలను నాటాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేశారు. ఆదివారం జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో భారీ సంఖ్యలో మొక్కలను నాటనున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో 1500, ప్రతి మున్సిపాలిటీలో 10వేల మొక్కలను నాటేందుకు గుంతలు తీసే ప్రక్రియ పూర్తి చేసి సరిపడా మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఆదివారం 558 గ్రామపంచాయతీల్లో 8.37 లక్షలు, 16 మున్సిపాలిటీల్లో 1.50 లక్షల మొక్కలను నాటనున్నారు. ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా ఈ ఏడాది 78 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 35 లక్షల మొక్కలను నాటే ప్రక్రియ పూర్తయింది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21న ఒక్కరోజే జిల్లాలో 5.50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. హారితహారంలో భాగంగా జిల్లాలో 38.70లక్షలకుగాను ఇప్పటివరకు 33.18లక్షల మొక్కలను నాటారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాం.