కులకచర్ల, ఆగస్టు 20 : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలో ఉన్న శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని శ్రావణమాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. పాంబండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని హంగులతో అలంకరించారు.
జాతరకు స్వరం సిద్ధం చేశారు. వారం రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామిని వారిని దర్శించుకోనున్నారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అదే విధంగా ఉగాదికి ముందు 12 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల విందుగా కొనసాగుతాయి. ఏకశిలా పర్వతంగా పేరొందిన పాంబండ క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాల వారికి కనువిందు చేస్తోంది. కులకచర్ల గ్రామం నుంచి పాంబండ దేవాలయానికి సుమారు 2 కిలోమీటర్లు ఉంది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 27వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్ తెలిపారు. 21న రుద్రాభిషేకం, అర్చనలు, 22న చిన్నజాతర, ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం 5గంటలకు శఖటోత్సవం, 23న స్వామివారికి ప్రత్యేక పూజలు, 24న పుష్పార్చన, 25న మాస శివరాత్రి రుద్రహోమం, 26న అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, 27న అమావాస్య రామలింగేశ్వర స్వామి సర్వదర్శనం, ఉత్సవాల ముగింపు ఉంటుంది.
శ్రావణమాసం సందర్భంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేశాం. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి కల్పించాం.