ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1 : ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం రాత్రి రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 10 గంటలకు ఆయన రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు. ముందుగా కలెక్టర్ ఫిజికల్ ఆక్టివిటీ హాల్లో విద్యార్థులు సాధించిన విజయాలకు సంబంధించిన పథకాలను పరిశీలించారు. వాటిని పరిశీలిస్తూ.. పాఠశాల పీఈటీ, విద్యార్థులను అభినందించారు.
అలాగే, వసతి గృహంలో ఉన్న లైబ్రరీని సందర్శించి దిన పత్రికలను ఎంత మంది చదువుతున్నారన్న దానిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అనారోగ్యంపాలు కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై విద్యార్థులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మెడికల్ కిట్స్, మందులు, కనీస అవసరాలు అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విద్యార్థులు చదువుకునే స్టడీ రూంను పరిశీలించారు. విద్యార్థులకు అందించాల్సిన కనీస వసతులు, భోజనాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భోజన శాలలో పాటిస్తున్న ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్పైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ వాలీబాల్ ఆడారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ మాట్లాడారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తుందన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చేవారు కారని, ప్రస్తుతం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు దొరికితే చాలని పోటీ పడుతున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జనరల్ నాలెడ్జి, క్రీడలు వంటివాటిలో విద్యార్థులు రాణించాలన్నారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, మల్టీ జోన్ -2 ఆఫీసర్ రజిని, ప్రిన్సిపాల్ వరోదిని, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట్ ఉన్నారు.