మర్పల్లి, జూన్ 28: పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మండలంలోని బూచన్‌పల్లి ప్రగతి బాటలో పయనిస్తున్నది. గ్రామస్తుల సహకారంతో పాలకవర్గం, అధికారులు గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామంలో 3,223 మంది జనాభా ఉండగా, 1704 మంది మహిళలు, 1519 పురుషులు ఉన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అధికారులు ఉత్సాహంగా గ్రామంలో విస్తృత అభివృద్ధి పనులు, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టారు.
ఆహ్లాదకర వాతావరణంలో..
గ్రామ ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి పచ్చందాలతో స్వాగతం పలుకుతున్నాయి. పెంటకుప్పలు, కలుపు మొక్కలను తొలగించి, 500 టేకు మొక్కలు నాటారు. గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు, రాత్రి వేళ ల్లో కాంతులు విరాజిల్లుతున్న లైట్లు పల్లెకు శోభ తెచ్చాయి. పల్లె ప్రకృతి వనం, నర్సరీతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగు నీరు, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకు డు గుంతలు ఏర్పాటుచేశారు. గ్రామ అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజూ పారిశుద్ధ్యం పనులు..
గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా పంచాయతీకి తీసుకున్న ట్రాక్టర్‌తో ప్రతి వీధిలో తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.తడి, పొడిచెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు
గ్రామంలో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయడంతో పాటు 100 శాతం మరుగుదొడ్లు నిర్మించి సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ఏర్పాటు చేశారు. బహిరంగా మల విసర్జనకు వెళితే జరిమానా వేసేలా గ్రామంలో నిబంధనలు అమలుచేశారు.
రూ.38 లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామంలో రూ.38 లక్షలతో అభివృద్ధి పనులు చేశాం. రూ.24లక్షలతో వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.9లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రూ.2.50 లక్షలతో కంపోస్టుషెడ్డు, రూ.2.48 లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మించాం. – శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి, బూచన్‌పల్లి