కులకచర్ల, ఆగస్టు 19: పల్లెలు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంతో గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. పల్లె ప్రగతిలో పారిశుధ్యం, పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బహత్తర కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామాల్లో వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు నిర్మిస్తున్నారు. పల్లె ప్రకృతివనం, నర్సరీ ఏర్పాటుచేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రతకు చర్యలు..
కులకచర్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామునిపల్లి గ్రామం పల్లె ప్రగతిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో రోజూ పరిసరాల పరిశుభ్రతతో వీధులన్నీ శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీ ట్రాక్టర్‌తో రోజూ ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తూ, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీకి కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, మురుగు నీటి కాల్వల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మించారు. పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు..
కామునిపల్లిలో గ్రామ సరిహద్దు వరకు బీటీ రోడ్డుకు ఇరుపక్కలా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో రోడ్డు మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. నర్సరీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు ఏపుగా పెరిగేందుకు రోజూ పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నారు. నర్సరీని చూసేందుకు సేవకుడిని నియమించి, మొక్కలకు రోజూ నీరు పోయించి, వాటిని సంరక్షిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం
గ్రామస్తుల సహకారంతో కామునిపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. పంచాయతీకి పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ప్రతినెలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తిచేశాం. ప్రభుత్వం చూపించిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేస్తున్నాం.
గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
కామునిపల్లి పంచాయతీని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. ఉన్నతాధికారులు సూచించిన విధం గా, సర్పంచ్ సహకారంతో గ్రామా న్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. రోజూ పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాం. గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించేలా చూస్తున్నాం.