
బొంరాస్‌పేట, జూలై 7: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మండలంలోని మెట్లకుంట గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదికను పరిశీలించి చాలా బాగున్నాయని ప్రశంసించి, మొక్కలు నాటారు. గ్రామాల బాగు కోసమే పల్లెప్రగతి కార్యక్రమమన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. పలు చోట్ల చెత్త, కంప చెట్లు పెరిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని జేసీబీతో తొలగించి శుభ్రం చేయాలని సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు. కూలడానికి సిద్ధం గా ఉన్న ఇంటిని పరిశీలించి దానిని తొలగించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు పక్క నుంచి డ్రైనేజీ నిర్మాణానికి కొందరు అడ్డుపడుతున్నారని వార్డు సభ్యులు కలెక్టర్ దృష్టికి తేగా, ప్రభుత్వ భూమిలో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిధులుంటే డ్రైనేజీ నిర్మిం చాలని ఆదేశించారు. పాఠశాల పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఫిర్యా దు చేయగా విచారాణ చేయాలని డీఎల్పీవోను ఆదేశించారు. ఎస్సీ కాలనీలోని ఆరవ వార్డు లో పాడుబడ్డ బావిని పూడ్చి స్థలం కబ్జా కాకుండా కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ నర్సింహులు, డీపీవో రిజ్వానా, డీఎల్పీవో చంద్రశేఖర్, ఎంపీడీవో పవన్‌కుమార్, ఎంపీవో పాండు తదితరులు పాల్గొన్నారు.