ఇబ్రహీంపట్నం, జూలై 7 : అభివృద్ధితో పాటు పారిశుధ్యంలో మున్సిపాలిటీని అగ్రగామిగా నిలుపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. బుధవారం 20, 21వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం, కలుపు మొక్కలు తొలగించడంతో పాటు పలు పనులను చేపట్టారు. ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.
రహదారి వెంట మొక్కలు నాటాలి
కడ్తాల్, జూలై 7 : జాతీయ రహదారికిరువైపులా మొక్కలు నాటి, ట్రీగార్డులను ఏర్పా టు చేయాలని జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, రోడ్డుకిరువైపులా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యుడు మహేశ్, నాయకులు లాయక్‌అలీ, రాంచంద్రయ్య, ప్రత్యేకాధికారి ధాత్రిదేవి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో తేజ్‌సింగ్ పాల్గొన్నారు.
గ్రామాల్లో జోరుగా పల్లె ప్రగతి
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 7 : ఎలిమినేడులో ఎంపీపీ కృపేశ్ పర్యటించి పల్లెప్రగతి పనులపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు, అధికారుల ఆధ్వర్యంలో పనులు పకడ్బందీగా జరుగుతున్నాయి.
గ్రామాల్లో ముమ్మరంగా పల్లెప్రగతి
మంచాల, జూలై 7 : గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. బండలేమూరులో ఎంపీపీ నర్మద పూర్తయిన పల్లె ప్రగతి పనులను పరిశీలించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
ఆమనగల్లు, జూలై 7 : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. మండలంలోని రాంనుంతలలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను ఆయన ఎంపీడీవో వెంకట్రాములుతో కలిసి పరిశీలించారు.
అత్యధిక మొక్కలు నాటుతాం
పెద్దఅంబర్‌పేట, జూలై 7 : మున్సిపాలిటీలో అత్యధిక మొక్కలను నాటి హరిత విప్లవం సాధిస్తామని కౌన్సిలర్ గీతావేణుగోపాల్రెడ్డి అన్నారు. 16వ వార్డులోని పలు కాలనీల్లో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. శ్మశానవాటికలో అల్లనేరడు, మర్రిమొక్కలు నాటేందుకు సిద్ధం చేశామన్నారు.
ఇంటింటికీ మొక్కలు..
యాచారం, జూలై 7 : వారం రోజులుగా గ్రామాల్లో అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు చేపడుతున్నారు. పారిశుధ్య పనులు, మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి నాటించారు.