షాబాద్, జూలై 5 : గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం షాబాద్ మండలం సర్దార్‌నగర్, కక్కులూర్ గ్రామాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కలెక్టర్ అమయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి పర్యటించారు. అనంతరం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై గ్రామస్తులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
కక్కులూర్లో ఏర్పాటు చేసిన గ్రామసభ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ఇంటింటికి ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు, హరితహారం నర్సరీ, పల్లెప్రకృతివనం ఉండేలా చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 95శాతం గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
రాష్ట్రంలో 12వేల జీపీలకు గతంలో 3వేల మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉండేవారని, పల్లె ప్రగతితో మరో 9వేల మందిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 20వేల గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల పంచాయతీ ఖాతాల్లో రూ.250 కోట్లు నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. చిన్న పంచాయతీలకు సైతం రూ.5లక్షలు అందించి అభివృద్ధికి సహకారం అందిస్తున్నామన్నారు. సిబ్బంది విధులను బాధ్యతగా నిర్వర్తించాలని.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలని, అందులో ఏమైనా తప్పులుంటే ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. గ్రామాల్లో పనులు సక్రమంగా జరుగకుంటే నేరుగా జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. 85 శాతం మొక్కలు బతకకుంటే కార్యదర్శి, సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
మిషన్ భగీరథ నీటితో వ్యాధులు దూరమయ్యాయన్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. సర్దార్‌నగర్‌లో పల్లె ప్రకృతివనం చాలా బాగుందని ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు.ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎస్సీ కాలనీల్లో పర్యటించి పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. దళిత సాధికారత పథకంతో ఎస్సీలకు ఎంతో మేలు జరుగనుందని చెప్పారు.జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. పారిశుధ్యం, మొక్కలు నాటడం వంటి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, సర్పంచులు స్వరూప, మమత, ఎంపీటీసీలు వనిత, కరుణాకర్, ఆర్డీవో వేణుమాధవ్‌రావు, ఎంపీడీవో అనురాధ, తహసీల్దార్ అమరలింగంగౌడ్, డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, ఎంఈవో శంకర్‌రాథోడ్, ఏవో వెంకటేశం, విద్యుత్‌శాఖ ఎస్ఈ వెంకన్న, ఏడీ రాందాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ఏఈలు శ్రీదివ్య, ప్రశాంత్‌రెడ్డి, శివకుమార్, ఏపీవో వీరాసింగ్, ఏపీఎం నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్, మల్లేశ్, రవి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జీవన్‌రెడ్డి, నర్సింహులు, శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు.