ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్ / మంచాల, జూలై 4 : ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధితో పాటు స్వచ్ఛతలో ఉరకలు వేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఎంపీపీ కృపేశ్ పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జోరుగా పల్లెప్రగతి పనులు..
మండలంలో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, కలుపు మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి రోడ్లు శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేశారు. మాల్లో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ రోడ్లను శుభ్రం చేశారు. నందివనపర్తిలో సర్పంచ్ ఉదయశ్రీ మొక్కలు నాటారు. మేడిపల్లిలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి శ్రమదానం నిర్వహించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మమతాబాయి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పట్టణ ప్రగతి
మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 2,9,10,13 వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ రాంపాల్‌నాయక్, కమిషనర్ శ్యామ్‌సుందర్ పర్యటించి పట్టణప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. వార్డుల్లో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. వార్డుల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యుత్ సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు సమస్యను వివరించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి పర్యటించి కాలనీలో మొక్కలు నాటారు.