షాద్‌నగర్‌రూరల్, జూలై 4 : ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామాల్లో హరితహారంలో భాగంగా ప్రజాప్రతినిధులు గ్రామస్తులకు మొక్కలను అందజేశారు. మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు.
హాజిపల్లిలో మొక్కలు అందజేత
ఫరూఖ్‌నగర్ మండలంలోని హాజిపల్లిలో సర్పంచ్ మౌనిక గ్రామస్తులకు మొక్కలు అందజేసి మాట్లాడారు.పచ్చని చెట్లతో పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుందన్నారు.
లింగారెడ్డిగూడలో..
ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడలో సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ బీష్వరామకృష్ణ లో రోడ్లను శుభ్రపర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామంలో చేపటాల్సిన అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులకు వివరించారు.
మండలంలో పారిశుధ్య కార్యక్రమాలు
కొందుర్గు, జూలై 4 : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని గ్రామాల్లో ఆదివారం పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలోని చెత్తాచెదారాన్ని, కలుపు మొక్కలను తొలగించి సుందరంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న మొక్కలకు పాదులు తీసి నీరందిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడండి
మొక్కలు పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని మండల ప్రత్యేకాధికారి డీఆర్డీవో అదనపు పీడీ నీరజ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని అజీజ్‌నగర్, ముర్తుజాగూడ గ్రామాల్లో ఆమె పర్యటించి పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకంతో గ్రామానికి పచ్చని తోరణం కట్టినట్లు ఉంటుందన్నారు. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని పకడ్బందీంగా నిర్వహిస్తున్నదన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, అజీజ్‌నగర్ సర్పంచ్ సంధ్య, పంచాయతీ కార్యదర్శి దీపలత, నాగిరెడ్డిగూడ ఇన్చార్జి సర్పంచ్ సురేందర్‌గౌడ్, కార్యదర్శి స్వప్న, ముర్తుజాగూడ సర్పంచ్ మణెమ్మ, ఉపసర్పంచ్ వసంత, కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో మరింత అందంగా..
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ సుందరంగా మారుతున్నదని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని 13, 22, 18 వార్డుల్లో ఆదివారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు అంతయ్య, సరిత, ప్రేమలతతో కలిసి పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. వార్డుల్లో పారిశుధ్యం లోపంపై వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారి నాగేశ్, వార్డు ప్రత్యేక అధికారి శేఖర్, నాయకులు వెంకటేశ్, శివ, రజినీకాంత్, గోపాల్, శ్రీను పాల్గొన్నారు.
గోపులారంలో శ్రమదానం..
మండలంలోని గోపులారంలో పల్లె ప్రగతి సందర్భంగా యువజన సంఘాలు, గ్రామస్తులు శ్రమదానం చేసి రోడ్లు, పరిసరాలు శుభ్రం చేశారు. సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు గ్రామంలోని రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, వార్డు సభ్యులు రమేశ్, సురేందర్, మహిళలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జోరుగా హరితహారం..
మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో హరితహారం పనులు జోరుగా సాగుతున్నాయి. అధికారులు, నాయకులు, గ్రామస్తులు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. పొలం దగ్గర, ఇంటి ఆవరణలో, రోడ్లకిరువైపులా ప్రజలు మొక్కలు నాటుతూ ప్రభుత్వ లక్ష్యానికి సహకరిస్తున్నారు. ఎంపీడీవో సత్తయ్య మహారాజ్ పేటలో పల్లెప్రకృతి వనాన్ని సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. వనం నిర్వహణపై సంతోషం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి మండల వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మట్టి కుప్పలను తొలిగింపజేసి, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు.
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి
హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మల్లాపూర్‌లో సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. హరిత తెలంగాణాను సాధించేందుకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరిత, కార్యదర్శి రాణి, నాయకులు పాండురంగారెడ్డి, జయేంధర్రెడ్డి, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలి
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారి ఆర్డీవో వేణుగోపాల్ రావు, ఎంపీడీవో హరీశ్‌కుమార్, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పట్టణంలో పర్యటించి, గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజ అగిరెడ్డి, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు నారాయణ పాల్గొన్నారు.
దామరిగిద్దలో..
పల్లె ప్రగతిని పండుగలా నిర్వహించాలని దామరిగిద్ద సర్పంచ్ వెంకటేశంగుప్తా అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని దామరిగిద్ద గ్రామంలో శ్రమదానం చేసి, స్కూల్ పిల్లలతో స్వచ్ఛ గ్రామంపై పెయింటింగ్ నిర్వహించి, కలుపు మొక్కలను తొలగించారు. గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.