ప్రారంభమయ్యాయి. కొన్ని నెలల తరువాత పాఠశాలల పరిసరాల్లో సందడి కనిపించింది. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్‌ను వెంటతెచ్చుకున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల టెంపరేచర్‌ను చెక్ చేసి లోనికి అనుమతించారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1317 ప్రభుత్వ పాఠశాలలు, 1376 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, తొలి రోజు 1,30,890 మంది విద్యార్థులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో 1,071 ప్రభుత్వ పాఠశాలలు, 184 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, మొదటి రోజు 35,832 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మహేశ్వరంలోని బాలికల పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
షాబాద్, సెప్టెంబర్ 1: కొవిడ్ కారణంగా మూతబడిన విద్యా సంస్థలు చాలా రోజులకు తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1317 ప్రభుత్వ, 1376 ప్రైవేటు పాఠశాలలున్నాయి. అందులో మొత్తం విద్యార్థులు 6,11,919 మంది విద్యార్థులున్నారు. మొదటి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 29,236 మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 1,01,654 మందితో కలిపి మొత్తం 1,30,890 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ముందుగా టెంపరేచర్ చెక్ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగించేలా చర్యలు చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు విద్యార్థులతో ప్రార్థన చేయించిన ఉపాధ్యాయులు, సాయంత్రం 4:30 గంటల వరకు తరగతులు నిర్వహించారు.
పరిగి, సెప్టెంబర్ 1: వికారాబాద్ జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో బుధవారం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించారు. గురుకులాలు మినహా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1071 ప్రభుత్వ, 184 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి మొత్తం 1,25,607 మంది విద్యార్థులున్నారు. మొదటి రోజు 35,832 మంది తరగతులకు హాజరైనట్లు జిల్లా విద్యా శాఖాధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 83,909 మందికి 24,189 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 41,698 మందికి 11,643 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో మొదటి రోజు అధికంగా విద్యార్థులు హాజరవడం గమనార్హం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి పాఠశాలలో విద్యార్థులు మాస్కులు ధరించి హాజరయ్యారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజర్లు అందజేశారు.
వికారాబాద్, సెప్టెంబర్ 1: జడ్పీహెచ్ఎస్తో పాటు మండలంలోని మైలార్‌దేవరంపల్లి పాఠశాలను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి బుధవారం సందర్శించారు. తరగతులు ప్రారంభించడంతోపాటు మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శానిటైజర్లను వికారాబాద్ ఎంఈవో బాబుసింగ్ పంపిణీ చేశారు.
కరోనా కారణంగా పాఠశాలలు మూసివేశారు. చాలా రోజులకు బడికి రావడం బడికి రావడం సంతోషంగా ఉంది..సంతోషంగా ఉన్నది. స్నేహితులు, ఉపాధ్యాయులను కలుసుకోవడం ఆనందంగా ఉన్నది. ఆన్లైన్ కంటే, ప్రత్యక్ష తరగతుల వల్లే విద్యాబోధన బాగుంటుంది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ సాయంత్రం వరకు పాఠశాలలోనే గడుపుతాం.