తుర్కయాంజాల్, మే 27 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘానికి ఇటీవల ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో గోదాముల నిర్మాణానికి శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భవిష్యత్‌లో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.25 కోట్ల నుంచి రూ. 30 కోట్లతో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అన్ని హంగులతో ఆధునిక టెక్నాలజీతో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో గోదాములతో పాటుగా కోల్డ్ స్టోరేజీల నిర్మాణం సైతం చేపడుతామన్నారు. 4 నెలల్లో గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ సాయిచంద్, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, డీసీవో ధాత్రిదేవి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్‌రాజ్, జ్యోతి, స్వాతి, శ్రీలత, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ హాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 మున్సిపాలిటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రతి నెలా తమ కిందిస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
రాబోయే రోజుల్లో అన్ని మున్సిపాలిటీలో జరుగబోయే పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చే స్తున్నదని, వాటి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టి ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, ఇరిగేషన్ ఎస్ఈ హైదర్‌ఖాన్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ కరుణాకర్‌బాబు, ఓఆర్ఆర్-2 సీజీఎం అమరేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, పీఆర్ ఎస్ఈ సురేశ్‌చంద్రారెడ్డి, మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.