రంగారెడ్డి, మే 5, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను వరి ధాన్యం సేకరణ ప్రారంభమైంది. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ధాన్యం సేకరణ షురూ చేశారు. ధాన్యాన్ని విక్రయించిన 24 గంటల్లో చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం సేకరించిన వెంటనే మిల్లులకు తరలించే ప్రక్రియను చేపట్టాలని, మిల్లుల్లో ధాన్యాన్ని దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి జాప్యం జరిగినా సంబంధిత కొనుగోలు కేంద్రం ఇన్చార్జిదే బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొన్నది.
ప్రతి గింజకు మద్దతు ధర..
అన్నదాతలు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్నది. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఇప్పటి వరకు 25 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాగా, మిగతా 4 కొనుగోలు కేంద్రాల్లో మరో ఒకట్రెండు రోజుల్లో ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 111 మంది రైతుల నుంచి 855 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కరోనా దృష్ట్యా గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వరి సాగవుతున్న గ్రామాలను బట్టి 29 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులంగా ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రాకుండా గ్రామాల వారీగా ఏఈవోలు ఇప్పటికే టోకెన్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా 35,333 ఎకరాల్లో వరి సాగు చేయగా, 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1888లు, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1868 మద్దతు ధర చెల్లిస్తున్నారు. జిల్లాలో 29 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 8, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, 25 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ధాన్యం వర్షానికి తడిసినట్లయితే ధాన్యాన్ని ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.