‘ఆమె పేరు స్వాతి (పేరు మార్చాం). భర్త ఆఫీసుకు వెళ్లాక కంప్యూటర్ ఆన్ చేసింది. అంతలోనే ‘హాయ్..ఐయామ్ శేఖర్’ అంటూ ఓ మెస్సేజ్. రిైప్లె ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు మళ్లీ మెస్సేజ్. ఏంటీ సమాధానం ఇవ్వడం లేదు? నీకిష్టం లేదా నాతో మాట్లాడటం? అంటూ సందేశం. అంతే..అదేం లేదంటూ అతడికి సమాధానం ఇచ్చింది. అలా మొదలైన పరిచయం భర్త స్థానంలో అతడిని ఊహించుకునేదాక వెళ్లింది. ఫలితం అన్యోన్యంగా ఉన్న ఆమె దాంపత్యంలో కలతలు.’
‘అతడి పేరు ప్రకాశ్. పెళ్లయి ఆరేండ్లు. ఇద్దరు పిల్లలు. నెట్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. చాటింగ్‌లోనే మునిగిపోయేవాడు. ఏడాది దాటేసరికి ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీకెండ్స్, పండుగలు ఆమెతోనే…ఆ మార్పు కారణంగా అతడి కుటుంబం బీటలు వారింది. భార్య విడాకులు కోరింది. పిల్లలు హాస్టల్లో అనాథలుగా మిగలాల్సి వచ్చింది.’
సిటీబ్యూరో, జూన్ 29 ( నమస్తే తెలంగాణ ): ఇంటర్నెట్ ఇంట్లోకి వచ్చాక.. దాంపత్య జీవితాలు బలైపోతున్నాయి. అపోజిట్ జెండర్ కోసం అన్వేషిస్తూ వివాహేతర సంబంధాల్లో కూరుకుపోతున్నారు. మౌస్‌లు కదుపుతూ మాయ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు. ఆన్లైన్ చాటున మరో దాంపత్యాన్ని ఏర్పరుచుకుంటున్నారు. వర్చువల్ రిలేషన్స్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఎక్కువగా పళ్లైన వారే… ఇంటి దగ్గర, ఆఫీసులో పరాయి వ్యక్తులతో అతి చనువు ప్రదర్శిస్తే నలుగురూ ఏమనుకుంటారోనన్న బిడియం, భయానికి ఈ చాటింగ్ యాప్‌లు ఓ వెసులుబాటుగా మారాయి. మాటలు హద్దు మీరినా..పట్టించుకునే వారు ఉండరు. ఈ ముసుగులో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడుతున్నాయి. వర్చువల్ రిలేషన్ మొదట్లో బాగానే అనిపించినా.. రానురాను వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది.
భార్య ఏం చెప్పినా.. సమయం లేదంటారు.. భర్త ఏం చెప్పినా నిరాకరిస్తారు. కారణం వారు మరో వ్యసన ప్రపంచంలో కూరుకుపోవడమే. కుటుంబ సభ్యులతో కలవరు. కంప్యూటరే లోకం. చాట్ చేస్తుంటారు. అర్ధరాత్రి అయినా కదలరు. భాగస్వామితో ఉండరు. ఊహలకు తగ్గట్టుగా లైఫ్ పార్ట్నర్ ఉండాలనుకుంటారు. పళ్లైయినా వారిలో లైంగికాసక్తి లోపించడమూ కనిపిస్తుంటుంది. ఆన్లైన్ స్నేహం ఓ భ్రమ అని తేలిపోయినా, ఆ బంధం చెదిరిపోయినా తట్టుకోలేకపోవడం ఒక ఇబ్బందైతే.. అప్పటి వరకు ఉన్న కుటుంబ అనుబంధాలు చెదిరిపోతాయి. ఫలితంగా జీవితం ఒంటరిగా మారి.. ఆత్మహత్యలు, హత్యలతో ముగుస్తుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
దాంపత్యం నిండుగా సాగాలంటే ఇద్దరి మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఎలాంటి సమస్య ఉన్నా చర్చించుకోవాలి. పరిష్కారం వెతుక్కోవాలి. ఇంటర్నెట్ బుట్టలో పడి భాగస్వామిని మోసం చేయాలనుకునే ధోరణి మంచిది కాదు. మనకు భాగస్వామిలో ఏం నచ్చడం లేదో చెప్పి మార్చుకోవాలి. క్షణిక సంబంధాలు హీనంగా ముగుస్తాయి. వర్చువల్ ఆలోచనలు కాదు.. నిజజీవితంలో బతకడం నేర్చుకోవాలి.
– డాక్టర్ మోతుకూరి రాంచందర్. సైకాలజిస్టు
భార్యాభర్తల మధ్య గౌరవం సరిసమానంగా ఉండాలి. ఏవో వాంఛల కారణంగా అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య సానుకూల సంబంధం లేకపోతే వాళ్లు మరో వ్యక్తి ప్రేమ కోసం అన్వేషిస్తారు. అది చెడు అని తెలిసినా అప్పటి పరిస్థితుల కారణంగా పెద్దగా ఆలోచించరు. అందులో మునిగిపోయి జీవితాలు నాశనం చేసుకుంటారు. అందుకే సరైన ఆలోచనలు చేసి దాంపత్యాన్ని కాపాడుకోవాలి.
– లక్ష్మి, సైకాలజిస్టు