షాద్‌నగర్‌రూరల్, మార్చి 11: రాష్ట్రంలోని ప్రతి రైతును రారాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రైతులు లాభాల పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామంలో పట్టుదారం తయారీ కేంద్రాన్ని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పట్టు రైతులు, రీలర్ల, వీవర్ల సమ్మేళనంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఒకే రకం పంటలను కాకుండా ప్రభుత్వ, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తే రైతులు లాభాల బాటలో పయనిస్తారన్నారు. అదే విధంగా మల్బరీసాగుతో లాభాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. పట్టు ఉత్పత్తిలో ప్రపంచలో చైనా తర్వాత మన దేశమే ఉందని, మల్బరీ సాగుపై రైతులు దృష్టి సారిస్తే మొదటి స్థానానికి చేరవచ్చన్నారు. సబ్సిడీతో షెడ్డు నిర్మాణాలను, ఉచితంగా మల్బరీ మొక్కలను సెరి కల్చర్ అధికారులు పంపిణీ చేస్తున్నారన్నారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులనే వాడాలన్నారు. పట్టుదారం ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
– కేంద్ర సిల్క్‌బోర్డు సభ్యుడు రాజిత్ రంజన్
వరి, పత్తి వంటి పంటలకు బదులు మల్బరీ సాగు చేస్తే రైతులు అధిక లాభాలను పొందవచ్చని కేంద్ర సిల్క్‌బోర్డు సభ్యుడు రాజిత్ రంజన్ అన్నారు. సెరీ కల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు చేశారు. తెలంగాణలో 13904 ఎకరాల్లో మల్బరీని సాగు చేస్తున్నారని, దీని ద్వారా 5600 మంది రైతులు ఉపాధి పొందుతున్నారన్నారు. మూడు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తే రూ. లక్షకు పైగా లాభాలను సాధించవచ్చన్నారు. మన జిల్లాలో సుమారు 250 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, రాష్ట్ర ఉద్యానవన డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, జిల్లా అధికారి సునందరాణి, ఆర్డీవో రాజేశ్వరి, ఎంపీవో కల్యాణి, సర్పంచ్ శ్రీనివాస్, సెరి కల్చర్ డైరెక్టర్స్ శివప్రసాద్, సుభాష్, బాబులాల్, శాస్త్రవేత్తలు ప్రవీణ్‌కుమార్, మహాదేవయ్య, సుధాకర్, సెరి కల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ముత్యాలు, నాయకులు వెంకట్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పట్టు రైతులు పాల్గొన్నారు.