రంగారెడ్డి, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్నది. సకల వసతులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. తద్వారా జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే జిల్లాలో 213 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో తొమ్మిది ప్రధాన పరిశ్రమలుండగా.. 4,549 మందికి ఉపాధి లభించింది. అలాగే మిగతా 204 సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ (మెగా) యూనిట్లు నెలకొల్పగా.. 13,907 మందికి జీవనోపాధి లభించింది.
రంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్నది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలో వేల కోట్లతో పలు రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇక్కడి వాతావరణం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూ లంగా ఉండటంతోపాటు అవసరమైన అనుమతులు కూడా టీఎస్-ఐపాస్ నుంచి సకాలంలో మంజూరు అవుతుండటం.. ప్రభుత్వం కల్పిస్తు న్న వసతులతో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఔత్సాహికులు సిద్ధమవుతున్నా రు. గతేడాది కూడా జిల్లాలో ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహంతో పలు రకాల పరిశ్రమలు ఏర్పడి దాదాపుగా 20వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధిని కల్పించింది.
జిల్లాలో గతేడాది 213 పరిశ్రమలు..
గతేడాది డిసెంబర్ 31 వరకు జిల్లాలో 213 పరిశ్రమలను కోట్లాది రూపాయలతో దేశ, విదేశాల కు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం, జిల్లా పరిశ్రమల కేంద్రం అనుమతితో ఏర్పాటు చేశా రు. ఈ సంస్థల ద్వారా 4,549 మందికి ఉపాధి లభించింది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ(మెగా) యూనిట్లు 204 ప్రా రంభం కాగా..వాటి ద్వారా 13,907 మందికి ఉద్యోగభృతి లభించింది.దీంతో జిల్లాలో 18,4 56 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ప్రముఖ పరిశ్రమల ద్వారా 4,549 మందికి ఉపాధి
2022 ఏడాదిలో జిల్లాలో తొమ్మిది ప్రముఖ, ప్రధాన సంస్థలు ఏర్పడ్డాయి. రూ. 1,400 కోట్ల పెట్టుబడితో ఈస్టర్ ఫిల్మ్ టెక్నాలజీ సంస్థ చందన్వెల్లిలో ఏర్పడగా 190 మందికి ఉపాధిని కల్పిస్తున్నది. అదేవిధంగా కొండకల్లో మేధా సర్వో డ్రైవ్స్‌ను రూ.625.87 కోట్లతో నెలకొల్పగా 50 మందికి, మంఖాన్ గ్రామంలో చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీని రూ.350 కోట్లతో ఏర్పాటు చేయగా 75 మందికి,రావిరాలలో రూ. 20 కోట్లతో ఏర్పాటైన రేడియంట్ అప్లియెన్సెస్ సంస్థ 2,800 మందికి, చందన్వెల్లిలో రూ. 304.13 కోట్లతో వెలసిన అమెజాన్ డాటా సర్వీసెస్ సంస్థ 34 మందికి, మహేశ్వరంలో రూ. 214.50 కోట్లతో ఏర్పాటైన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ 100 మందికి, కందువాడలో రూ.214 కోట్లతో వెలసిన స్పిన్‌మ్యాక్స్ టైర్స్ సంస్థ 100 మందికి, పెంజర్లలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ 200 మందికి, ఎల్కిచెర్లలో రూ.102 కోట్ల పెట్టుబడితో వెలసిన ఆర్పీఏ యూనిబేక్స్ కంపెనీ 1000 మం దికి ఉపాధిని కల్పిస్తున్నది. ఈ పరిశ్రమల ద్వారా జిల్లాలో మొత్తంగా 4,549 మందికి ఉపాధి లభిస్తున్నది. ఒక్క ఏడాదిలోనే జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పరిశ్రమలకు హబ్‌గా జిల్లా మారింది.
204 యూనిట్లతో 13,907 మందికి..
జిల్లాలో టీఎస్-ఐపాస్ ద్వారా రూ.12,769. 18 కోట్ల పెట్టుబడులతో 436 సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ (మెగా) పరిశ్రమలను నెలకొల్పేందుకు 2022 సంవత్సరంలో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే అనుమతులొచ్చాయి. వాటిలో రూ.108.67 కోట్లతో 121 సూక్ష్మ తరహా పరిశ్రమలు ప్రారంభం కాగా 1,881 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అదేవిధంగా 68 చిన్నతరహా పరిశ్రమలు రూ.405.81 కోట్ల తో ప్రారంభమై 2,379 మందికి, మూడు మధ్యతరహా యూనిట్లు రూ.37.90 కోట్లతో ప్రారంభమై 315 మందికి, ఐదు పెద్ద తరహా పరిశ్రమలు రూ.1010.76 కోట్లతో ప్రారంభం కాగా 678 మందికి, 8(మెగా) భారీ తరహా యూనిట్లు రూ.3495.47 కోట్లతో ప్రారంభమై 8,654 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. మొత్తంగా టీ ఎస్ఐపాస్కింద 204 పరిశ్రమలను రూ.5,058. 62 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 13,907 మందికి జీవన భృతిని కల్పిస్తున్నాయి.