సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. భూభారతి సమస్యలు వేలాదిగా పేరుకుపోతున్నాయి. అధికారుల, నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వానికి రంగారెడ్డి కలెక్టరేట్ నిదర్శనంగా నిలుస్తున్నది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన భూభారతి సమస్యలను పరిష్కరించడం తలకు మించిన భారంగా మారిందని ఏకంగా నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఫైళ్లన్నీ పరిశీలించిన ఆయన భూభారతి సమస్యలను చూసి అవాక్కయ్యారు. ఏకంగా 4600 పెండింగ్ ఫైళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాలని బాధితులు రోజూ వందలాదిగా వస్తుండటంతో తనకు సమయం కావాలని ఏకంగా నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. గతంలో పనిచేసిన అధికారి అర్జీలను త్వరితగతిన పరిష్కరించకపోవడం, ఆయన బదిలీ తర్వాత వెంటనే కొత్త అధికారిని నియమించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. కొత్త అదనపు కలెక్టర్ వేగంగా సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.