మొయినాబాద్, డిసెంబర్18 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం సైబర్ పోలీస్‌స్టేషన్, సైబర్ వలంటీర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే వాటిపట్ల జాగ్రత్త వహించాలన్నారు.
బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, తమ ఏటీఎంలు బ్లాక్ అయ్యిందని, ఓటీపీ నంబర్ చెప్పాలని కాల్స్ చేస్తుంటారని, అలాంటి వాటికి స్పందించకూడదని సూచించారు. లాటరీలో గిప్టులు వచ్చాయని, అందుకు కొన్ని డబ్బులు కట్టాలని చెబుతూ ఉంటారని, వాటిని కూడా నమ్మొద్దని సూచించారు. ఏదైనా లింక్‌లు వస్తే వాటిని ఓపెన్ చేయరాదని అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, డీఐ రమేశ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : విద్యార్థులు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయవద్దని శంకర్పల్లి ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. బుధవారం శంకర్‌పల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థినులు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే డయల్ 100, లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జ్యోతి, మమత, శ్రీనివాస్, టీఎస్ మాడల్ సూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.