ఇబ్రహీంపట్నంరూరల్, మే 12 : వేసవిలో పొలాలను దున్నుకోవడంతో కలుపు, చీడపురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడి పొందవచ్చనే అధికారుల సూచనలతో అన్నదాతలు పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం పొలాల్లో ఎలాంటి పంటలు లేనందున లోతుగా దుక్కులు దున్నుకుంటే ఏ పంట వేసినా అధిక దిగుబడి ఎక్కువగా సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దున్నడం ప్రారంభించి వానకాలానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే వరి పంటలు కోసి పొలాలను శుద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలను వినియోగిస్తూ అధికారుల సూచనలతో పంటలు సాగు చేస్తే వ్యవసాయం మంచి లాభసాటిగా మారుతుందని చెబుతున్నారు వ్యవసాయాధికారులు.
వేసవిలో లోతుగా దుక్కులు దున్ని తొలకరి జల్లులు కురిసిన తర్వాత గొర్రు తిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతెల వంటి పరికరాలు నేల లోపలికి 3 నుంచి 6 అంగుళాల వరకు చొచ్చుకునిపోతాయి. ఈ పరికరాలు తరచూ ఉపయోగించడం వలన నేల లోపల సుమారు 3 నుంచి 5 అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. దీంతో నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున వేసవి దుక్కుల సమయంలో నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టి పొర ఛేదించబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది.
పొలాల్లో వేసవి దుక్కులు దున్నినప్పుడు కలుపు మొక్కలు, కాయలు, వేర్లు, దుంపలు పెకిలించబడి వేసవిలో ఉండే ఉష్ణోగ్రతలకు అవి నశించడానికి ఆస్కారం ఉంటుంది. దుక్కి దున్నిన తర్వాత నేలపైకి తేలిన కాయలు, దుంపలు ఏరివేసుకుంటే పొలం శుభ్రంగా తయారవుతుంది. తుంగ, గరిక, గుంజర వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో అధికంగా పెరిగి పంటలను నాశనం చేస్తుంటాయి. కాని వేసవి దుక్కులు లోతుగా తీయడంతో పొలంలోని చీడలు నాశనమయ్యే అవకాశమున్నందున రైతులు అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు.
దుక్కులను లోతుగా దున్నడం వల్ల నేల వదులై మెత్తగా తయారవుతుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే నీరు పల్లంవైపు పొర్లకుండా ఎక్కడికక్కడే పొలంలోనే ఇంకిపోతుంది. భూమికి ఎక్కువ రోజులు తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల పైరు వేసిన తర్వాత వర్షాలు పడటం కొద్దిగా ఆలస్యమైనా పంటకు నష్టం జరుగదు.
పంటల కోతల తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు, పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకుల వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోయి ఎరువుగా మారుతాయి. దీంతో నేలలో సేంద్రియ పదార్థాలు, పోషక విలువలు పెరుగడానికి అవకాశం ఉంటుంది. లోతు దక్కులు దున్ని సిద్ధం చేసుకుంటే వానకాలానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
వేసవిలో పొలాల్లో ఎలాంటి పంటలు ఉండవు. కాబట్టి రైతులు వేసవిలో తమ పొలాల్లో పశువులు, గొర్రెల మందలు పెట్టుకుంటే మంచిది. పశువులు, గొర్రెలను పొలంలో మందలు కట్టడం రైతులకు పాత విషయమే, కాబట్టి ఆ పని వేసవిలో చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పొలంలో మందలను కట్టిన సమయంలో మల, మూత్రాలు విసర్జిస్తాయి. దీంతో చేనుకు అవసరమైనంత ఎరువు లభించి పొలానికి అదనపు బలం చేకూరుతుంది.
వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకుంటే తొలకరిలో కురిసే వర్షాలకు నీరు భూమిలో ఇంకిపోయి పొలం తడిగా మారే అవకాశం ఉంటుంది. రైతులు వరి పంటలు కోయడంతో పాటు ఇతర పొలాల్లో ఎలాంటి పంటలు లేనందున దుక్కి దున్నాలి.
– శ్రవణ్‌కుమార్, ఏఈవో, ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ
పంటలు తీసుకున్న తర్వాత వెంటనే భూములు దున్నితే భూమికి బలం చేకూరుతుంది. రాలిన ఆకులతో భూమికి మల్చింగ్ చేసినట్లు అవుతుంది. అప్పుడే భూమి బాగా మరిగి పంటల దిగుబడి ఎక్కువగా వస్తుంది. వరి పంట కోసిన వెంటనే పొలం దుక్కులు దున్ని పెట్టుకుంటే వర్షాలు పడే నాటికి భూమిలో మంచి బలం చేకూరుతుంది. తొలకరి పలుకరించిన వెంటనే ఎలాంటి పంటలు వేసుకున్నా దిగుబడి బాగుంటుంది.
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతు సంఘం నాయకుడు