అల్పపీడనం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శంకర్‌పల్లిలో 1.94 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో 28.3 మి.మీ వర్షపాతం నమోదైంది. పత్తి, మొక్కజొన్న, కంది పంటలను విత్తుకునేందుకు, వరి నాట్లు వేసుకునేందుకు ఆగస్టు నెల వరకు అవకాశం ఉండడంతో అన్నదాతలు పనుల్లో నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రైతన్నలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లను ముట్టుకోవద్దని, చెరువుల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి సూచించారు.
– రంగారెడ్డి, జూలై 18 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 18(నమస్తే తెలంగాణ): ‘అల్పపీడనం కారణంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్థరాత్రి తర్వాత ప్రారంభమైన వాన..మంగళవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జిల్లాలో మంగళవారం సరాసరి వర్షపాతం 24.95సెం.మీ.లుగా నమోదైంది. అత్యధికంగా శంకర్‌పల్లిలో 1.94 సెం.మీ.లు, చేవెళ్లలో 1.82 సెం.మీ.ల వర్షం కురిసింది. కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నరు.
ఆశాజనకంగా సాగు..
నిన్నమొన్నటి వరకు వర్షాభావం వెంటాడినప్పటికీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానకాలంలో 3.90లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సీజన్ ఆరంభం నుంచి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 94.0మిల్లీమీటర్లు కాగా..82.6మి.మీ.ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూలై నెలలో 146.6మి.మీ.ల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 67.0మి.మీ.ల వర్షం మాత్రమే కురిసింది. ఈ పరిస్థితుల్లో జిల్లా రైతాంగం ఇప్పటివరకు 98వేల ఎకరాల్లోనే వివిధ రకాల పంటలను సాగు చేసింది. అత్యధికంగా 70వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతన్నల ఆశలను సజీవంగా నిలుపుతున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి వరి నాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే..ఇంకా రెండు, మూడు రోజుల వరకు పత్తితోపాటు, మొక్కజొన్న, కంది పంటలను విత్తుకునేందుకు అవకాశం ఉండడంతో రైతులు ఆయా పంటల విత్తనాలను విత్తుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలి. వ్యవసాయ పనుల సందర్భంగా రైతన్నలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లను ముట్టుకోవద్దు. చెరువుల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసర సేవల కోసం పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
వికారాబాద్ జిల్లా అంతటా మోస్తరు వర్షం
వికారాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 98.7 మి.మీటర్లుకాగా, ఇప్పటివరకు 143 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతానికి సంబంధించి…అత్యధికంగా పూడూరు మండలంలో 28.3 మి.మీటర్ల వర్షపాతం, పెద్దేముల్ మండలంలో 24.3, తాండూరు మండలంలో 23.8, ధారూరు మండలంలో 23, కోట్‌పల్లి మండలంలో 21.4, వికారాబాద్, నవాబుపేట మండలాల్లో 20.3, మర్పల్లి మండలంలో 17.5, మోమిన్‌పేట్ మండలంలో 15.7, యాలాల మండలంలో 17.1, దుద్యాల మండలంలో 15.3, బంట్వారం మండలంలో 16.5, కులకచర్ల మండలంలో 16.4, పరిగి మండలంలో 11.6, బషీరాబాద్ మండలంలో 14.4, చౌడాపూర్ మండలంలో 13.2, కొడంగల్‌లో 11.6, దౌల్తాబాద్‌లో 9.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.