సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. హైదరాబాద్కు వచ్చే వారితో పాటు నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే వారితో ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్లతోపాటు, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లకు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు.
సెలవులు ముగియడంతో ఉద్యోగరీత్యా ఇండ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించినట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. అయితే నగరానికి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30గంటల నుంచి సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు, రైల్వే జంక్షన్లు కూడా వచ్చిపోయే ప్రయాణికులతో నిండి ఉన్నాయి. ఇక మంగళవారం ఆఫీసులకు వెళ్లే వారితో మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది.
గత నాలుగు రోజులు జనాలు లేకపోవడంతో బోసిపోయి ఉన్న మెట్రో స్టేషన్లు, ఒక్కసారిగా రద్దీగా మారిపోయాయి. అదే సమయంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో జనాలు నిండిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుని, ఇక్కడి నుంచి ఇండ్లకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నగరంలో ఆటో, క్యాబ్ ధరలతో పోల్చితే మెట్రో ద్వారా తక్కువ ఖర్చులో ప్రయాణించే వీలు ఉండటంతో రద్దీ పెరగడానికి కారణాలు చెబుతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ మెట్రోకు ఆదరణ వస్తుండగా.. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు మెట్రో గణాంకాల్లోనూ తేలింది.